Russia Slams America: భారత్‌పై అమెరికా పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. ఈ మధ్యే ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌కి వలసవాదులంటే భయం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు పౌరసత్వ సవరణ చట్టం (CAA) గురించి కూడా యూఎస్ ఇదే విధంగా జోక్యం చేసుకుంది. దీనిపై భారత్ కాస్త గట్టిగానే స్పందించింది. ఇప్పుడు మరోసారి భారత్‌లో మతపరమైన స్వేచ్ఛ లేదంటూ అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై రష్యా తీవ్రంగా మండి పడింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో భారత్ ప్రతిష్ఠకి భంగం కలిగించే విధంగా అమెరికా వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేసింది. భారత దేశ వైఖరిని, చరిత్రని అర్థం చేసుకోవడంలో అమెరికా విఫలమవుతోందని తేల్చి చెప్పింది. అనవసరపు ఆరోపణలు చేస్తోందని రష్యా విదేశాంగ మంత్రి ప్రతినిధి మరియా జకరోవా స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఇండియాని కించపరచడమే అని తేల్చి చెప్పారు. భారత్‌లో రాజకీయపరంగా అనిశ్చితిని తీసుకురావాలని, ఎన్నికలపై ప్రభావం చూపించాలని అమెరికా భావిస్తోందని ఆమె విమర్శించారు. భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే పని మానుకోవాలని హెచ్చరించారు.
ఇటీవలే అమెరికా ఓ రిపోర్ట్ విడుదల చేసింది. అందులో భారత్‌కి వ్యతిరేకంగా కొన్ని అంశాలు ప్రస్తావించింది. మత స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆరోపించింది. ఇది కచ్చితంగా దృష్టి సారించాల్సిన విషయం అని అభిప్రాయపడింది. మరో కీలక విషయం ఏంటంటే..ఈ రిపోర్ట్ బీజేపీని టార్గెట్ చేసింది. జాతీయవాదం పేరుతో వివక్షతో కూడిన విధానాలు ఈ పార్టీ అమల్లోకి తీసుకొస్తోందని మండి పడింది. Unlawful Activities Act,CAAతో పాటు యాంటీ కన్వర్షన్ లా, గోవధ నిషేధ చట్టాలను ఇందులో ప్రస్తావించింది. వీటిని మరోసారి పరిశీలించాల్సిన అవసరముందని తేల్చి చెప్పింది ఈ నివేదిక. భారత్‌లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ చట్టాల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నాయని వెల్లడించింది.