సౌత్ తమిళనాడు, నార్త్ తమిళనాడు..


తమిళనాడుని రెండు రాష్ట్రాలుగా విభజించనున్నారా..? ప్రస్తుతం తమిళనాట ఇదే హాట్ టాపిక్. భాజపా ఫ్లోర్ లీడర్ నాయ్‌నర్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అలజడి రేగింది. "తమిళనాడు రెండు రాష్ట్రాలుగా విడిపోవాలని కోరుకుంటున్నా" అని నాగేంద్రన్ అన్నారు. అంతకు ముందు డీఎంకే ఎంపీ ఏ. రాజా "తమిళనాడు ప్రజలు తమకంటూ ప్రత్యేక దేశం కావాలనే వరకూ పరిస్థితులు
తెచ్చుకోవద్దు" అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వీటికి కొనసాగింపుగా భాజపా నేత కామెంట్స్ చేశారు. అంతటితో  ఆగకుండా...ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమిళనాడుని విభజించే అధికారం ఉందని అన్నారు. హామీలు నెరవేర్చలేదంటూ డీఎమ్‌కే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 


తమిళనాడులోనూ మహారాష్ట్ర తరహాలో..?


"ప్రత్యేక తమిళనాడు కావాలంటూ రాజా కామెంట్ చేశారు. నాకూ అలాంటి ఆకాంక్షే ఉంది. 234 నియోజకవర్గాలున్న తమిళనాడుని రెండుగా విభజించవచ్చు. సౌత్, నార్త్‌గా విడగొట్టి ఒక్కో రాష్ట్రంలో 117 స్థానాలు కేటాయించాలి. రెండు రాష్ట్రాలకూ ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారు. భాజపాకు చెందిన వారో, లేదంటే భాజపా కూటమికి చెందిన వారో సీఎం కుర్చీలు కూర్చుంటారు" అని నాగేంద్రన్ అన్నారు. "తమిళనాడుని మేము విడగొట్టలేం అని అనుకోవద్దు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే స్థానంలో మేమున్నాం. ప్రధాని మోదీ అనుకుంటే కచ్చితంగా జరిగి తీరుతుంది" అని స్పష్టం చేశారు. గతంలో  ఏఐడీఎమ్‌కేలో ఉన్న నాగేంద్రన్, తరవాత భాజపాలో చేరారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే...ఇంత వరకూ భాజపా అధిష్ఠానం కానీ, భాజపా సీనియర్ నేతలు కానీ నాగేంద్రన్ వ్యాఖ్యల్ని ఖండించలేదు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె. అన్నామలై మాత్రం మహారాష్ట్రలోని శివసేనను, డీఎమ్‌కేని పోల్చటం రాజకీయంగా చర్చకు దారి తీసింది. "ఏక్‌నాథ్" లాంటి వ్యక్తి తమిళనాడులో రాజకీయాల్ని మార్చుతాడని జోస్యం చెప్పారు. 


ఇంత వరకూ వివరణ ఇవ్వని భాజపా 


డీఎమ్‌కే మాత్రం భాజపా నేత వ్యాఖ్యల్ని ఖండించింది. భాజపా అధికార మత్తులో ఉందని విమర్శించింది. ఏ ప్రాతిపదికన తమిళనాడును విభజిస్తారో చెప్పాలంటూ ప్రశ్నించింది. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా అని మండిపడింది. తమిళనాడుని మూడు ముక్కలు చేసినా, ఆ మూడు రాష్ట్రాల్లోనూ డీఎంకేనే అధికారంలో ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పుడే కాదు. గతంలోనూ భాజపా నేత నాగేంద్రన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. గతేడాది జులైలోనూ తమిళనాడును కొంగునాడు, తమిళ్‌నాడుగా విభజిస్తారన్న పుకార్లు వచ్చాయి. తమిళనాడులో 7 జిల్లాలున్న పశ్చిమ ప్రాంతాన్ని కొంగునాడుగా పిలుస్తారు. అయితే అప్పుడు మాత్రం భాజపా వెంటనే అప్రమత్తమైంది. "ఏదో తప్పు జరిగింది" అంటూ వివరణ ఇచ్చింది. ఈ సారి అది కూడా చేయకపోవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


 Also Read: Adah Sharma Photos:అచ్చం చింపాజీలా మారిపోయిన అదాశర్మ, చూస్తే నవ్వకుండా ఉండలేరు


Also Read: Pragathi Mahavadi: కామెంట్స్‌కు డోంట్ కేర్ - హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అంటున్న ప్రగతి