Students Forced To Remove Sacred Thread : బెంగళూరులో జరిగిన సీఈటీ (CET) పరీక్షల సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. పరీక్ష రాయడానికి వచ్చిన ఐదుగురు బ్రాహ్మణ విద్యార్థులను   వారి జంధ్యం  తొలగించాలని ఇన్విజిలేటర్లు ఆదేశించడం సంచలనంగా మారింది. మడివాళలోని కృపానిధి కళాశాల కేంద్రంగా జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు  రాజకీయంగానూ కలకలం రేపుతోంది.  అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

Continues below advertisement

జంధ్యం తీసేస్తేనే పరీక్ష రాయనిచ్చిన ఇన్విజిలేటర్లు

 విద్యార్థులు  తమ చెవి పోగులు తొలగించమంటే నిబంధనల మేరకు అంగీకరించామని, కానీ శరీరంపై ఉన్న పవిత్రమైన జంధ్యాన్ని కూడా తొలగించమని ఒత్తిడి చేయడం తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష పూర్తయ్యాక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కళాశాల వద్దకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. గత ఏడాది కూడా ఇలాంటి వివాదం తలెత్తినప్పుడు, జంధ్యాలను తొలగించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, మళ్లీ అదే పునరావృతం కావడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Continues below advertisement

ప్రభుత్వంపై విరుచుకుపడిన బీజేపీ  

రాజకీయంగా ఈ అంశంపై బీజేపీ విరుచుకుపడింది. అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఆర్. అశోక   సిద్ధరామయ్య ప్రభుత్వం  హిందూ వ్యతిరేక  విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. ఒకవైపు ఉర్దూ పాఠశాలల వేళలను మార్చుతూ ఒక వర్గానికి కొమ్ముకాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరోవైపు పరీక్షల పేరుతో మంగళసూత్రాలు, జంధ్యాలను తొలగిస్తూ హిందూ విశ్వాసాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. ఇది అనధికారికంగా షరియా చట్టాన్ని  అమలు చేయడమేనని ఆయన ఘాటుగా విమర్శించారు.

ఘటనకు కారణమైన వారిపై చర్యలు

మరోవైపు, ఈ ఘటనపై కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎం.సి. సుధాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గతంలోనే ఇలాంటివి జరగకూడదని హెచ్చరించినప్పటికీ, మళ్లీ ఇలా జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు సిబ్బందిని కళాశాల యాజమాన్యం ఇప్పటికే సస్పెండ్ చేసిందని, వారిపై పోలీసు కేసు కూడా నమోదైందని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే కఠిన శిక్షలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.   

పోలీసుల అదుపులో ముగ్గురు సిబ్బంది

ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంలో ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరీక్షా కేంద్రాల మార్గదర్శకాలలో ఎక్కడా జంధ్యం తొలగించాలని లేదని, కేవలం మెటల్ వస్తువులపైనే నిషేధం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ జంధ్యం వివాదం కర్ణాటకలో మతపరమైన, రాజకీయపరమైన సెగలను పుట్టిస్తోంది. ప్రభుత్వం నియమించిన దర్యాప్తు కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.