KL Rahul Century Celebration | న్యూఢిల్లీ: పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచులో రాహుల్ అజేయ సెంచరీ (16 ఫోర్లు, 9 సిక్సర్లు) తో చెలరేగాడు. నితిష్ రాణా భారీ హాఫ్ సెంచరీ (11 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి పంజాబ్ కు కష్టసాధ్యమైన టార్గెట్ ఇచ్చింది.

Continues below advertisement

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ 2026 పోరులో కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో తన విమర్శకుల నోళ్లు మూయించాడు. తన సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ 47 బంతుల్లో శతకం సాధించాడు. 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సెంచరీ మార్క్ చేరుకున్న రాహుల్ టెక్నిక్, క్లాస్ ఇన్నింగ్స్‌ను మెచ్చుకుని తీరాల్సిందే. ఐపీఎల్ తాజా సీజన్లో ఒక్క ఓటమి కూడా లేకుండా అజేయంగా ఉన్న ఏకైక జట్టు బౌలింగ్ అటాక్‌ను కకావికలం చేశాడు.

ఈ సెంచరీ రాహుల్‌కు కీలకం. ముఖ్యంగా పవర్‌ప్లేలో అతని స్ట్రైక్ రేట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్న సమయంలో 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో సెంచరీ చేయడం విశేషం. ఢిల్లీ ప్రేక్షకుల చప్పట్ల మధ్య క్లాస్ బ్యాటర్ శతకం సాధించి, వినూత్న రీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. రాహుల్ సెలబ్రేషన్ వీడియో వైరల్ అవుతోంది. లీగ్ చరిత్రలో తాను ఎందుకు అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకరిగా ఎందుకు కొనసాగుతున్నారో మరోసారి నిరూపించుకున్నాడు.

Continues below advertisement

కేఎల్ రాహుల్ మైలురాయి.. ఈ మాస్టర్‌క్లాస్ ఇన్నింగ్స్ సమయంలో కేఎల్ రాహుల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనీని అధిగమించాడు. ధోనీకి వెనక్కి నెడుతూ టాప్ సిక్స్‌లోకి ప్రవేశించడం ద్వారా, తన జట్టుకు తానెంత కీలకమో మరోసారి నిరూపించుకున్నాడు. తన సమకాలీన దిగ్గజాల కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే రాహుల్ ఈ ఘనత సాధించాడు. 

 

నితీష్ రాణాతో కలిసి రాహుల్ నెలకొల్పిన భాగస్వామ్యం ఢిల్లీ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచింది. 12 పరుగుల వద్ద ఉన్నప్పుడు పంజాబ్ ఫీల్డర్ శశాంక్ సింగ్ వదిలేసిన క్యాచ్ తరువాత రాహుల్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని పరుగులు సాధించాడు. అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్‌ లాంటి పటిష్టమైన పంజాబ్ కింగ్ పేస్ దళాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాడు.

లీగ్ టేబుల్ టాపర్లపై రాహుల్ సత్తా..ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ఆధిపత్యం చెలాయిస్తోంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అలాంటి పంజాబ్ జట్టుపై రాహుల్ సెంచరీ చేయడం చాలా కీలకం. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ క్యాపిటల్స్ జట్టు మిడిల్ ఓవర్లలో ఓవర్‌కు 10 పరుగుల కంటే ఎక్కువ రన్ రేట్‌ను కొనసాగించింది.

మ్యాచ్ చివరి దశకు చేరుకోవడంతో, రాహుల్ చేసిన క్లాస్ సెంచరీ ఢిల్లీ క్యాపిటల్స్‌ అభిమానుల్లో జోష్ తెచ్చింది. ఈ మ్యాచ్ నిలుపుకోవాలంటే ఢిల్లీ బౌలర్లు సైతం రాణించాల్సి ఉంటుంది. లేకపోతే సొంత ప్రేక్షకుల సమక్షంలో టేబుల్ టాపర్ల అజేయ పరంపర కొనసాగుతుంది.