Revanth Reddy Regional Ring Road Hyderabad: హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. అడ్డంకులన్నీ అధిగమించి, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతల నిర్మించ తలపెట్టిన రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్ లో పడింది. 


భారత్​ మాల పరియోజన ఫేజ్ ‌‌వన్ లో  రీజనల్ రింగ్ రోడ్డు (ఉత్తరం) 158.645 కిలోమీటర్ల మేరకు తలపెట్టారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు తెలంగాణ రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 1935.35 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 1459.28 హెక్టార్ల భూసేకరణ పూర్తయింది. 


గత ప్రభుత్వం సహాయ నిరాకరణ ధోరణి కారణంగా తొమ్మిది నెలలుగా ఈ ప్రాజెక్టు భూసేకరణలో ఎటువంటి పురోగతి లేదు. నేషనల్ హైవే అథారిటీ (NHAI) తో తలెత్తిన చిక్కుముడులను పరిష్కరించే ప్రయత్నం జరగలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీజనల్​ రింగ్ రోడ్డుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 


రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అవుటర్ రింగ్ రోడ్డు లోపల అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్ గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ఇందులో భాగంగా రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేయాల్సిన అవశ్యాన్ని సీఎం అధికారులతో చర్చించారు. ఈ రహదారి పూర్తయితే  రవాణా సదుపాయాలతో  సెమీ అర్బన్ జోన్లో కొత్త పరిశ్రమలు రావటంతో పాటు అభివృద్ధి వేగం పుంజుకుంటుందని అన్నారు. 


నిలిచిపోయిన భూసేకరణను రాబోయే 3 నెలలలో పూర్తి చేయాలని, భూసేకరణతో పాటే ఆర్ఆర్ఆర్ (ఉత్తరం) పనులకు టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ (దక్షిణం) భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని,  తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని NHAI ని కోరారు.  రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు ఆర్థికంగా ఎంత భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడే ఏ కార్యానైనా నిర్వహించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తుందని అన్నారు.