Resort Politics : ప్రభుత్వాలను కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించడం చూశాం. అలాగే ప్రభుత్వాలను కూల్చడానికి కూడా అలాంటి పనులు చేయడం చూశాం. అయితే అది రాష్ట్ర స్థాయి ప్రభుత్వాలకే ఇలా జరుగుతుంది. ఇంకా తక్కువలో తక్కువగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వంటి పీఠాలను కాపాడుకోవడానికో.. గెల్చుకోవడానికో క్యాంపులు ఏర్పాటు చేస్తూంటారు. ఇప్పుడు ఈ తరహా ప్రజాస్వామ్య పోరాటం మరింత ముందుకెళ్లింది. కర్ణాటకలో ఓ పంచాయతీ సర్పంచ్ ను పదవి నుంచి దింపి తమ వారిని కూర్చోబెట్టుకోవడానికి ఎనిమిది మంది వార్డు సభ్యులను క్యాంప్‌కు తీసుకెళ్లారు. రిసార్ట్‌లో కూర్చోబెట్టారు. ఇలా ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా నలభై రోజులుఆ వార్డు సభ్యులు రిసార్టులో ఉన్నారు.
ఓ చిన్న గ్రామంలో సర్పంచ్ పదవిపై పంచాయతీ
బెంగళూరుకు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రానేబెన్నూరు అనే గ్రామం.. సగటు భారతీయ గ్రామం లాంటిదే. అక్కడ కొన్నాళ్ల కిందట పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పార్టీలు కాకుండా.. వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరాటం తరహాలో జరిగాయి. భట్ అనే ఓ ఆశ్రమ నిర్వాహకుడు.. తన వర్గాన్ని నిలబెట్టుకుని ఎక్కువ మందిని గెలిపిచుకున్నారు. ఆయన సర్పంచ్ పదవిని.. నలుగురికి పంచాలనుకున్నారు. ఆ మేరకు ఒప్పందం చేసుకుని తొలి పదిహేను నెలల పాటు నాయర్ అనే వార్డు మెంబర్‌కు చాన్సిచ్చారు. అతని పదిహేను నెలల పదవీ కాలం ఎప్పుడు పూర్తవుతుందా.. అని తర్వాత పదవి చేపట్టబోయే పంచాయతీ మెంబర్ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయం ముగిసింది. ముందుగా పదవి తీసుకున్న నాయర్ పద్దతిగా పదవికి రాజీనామా చేసి ఉంటే సమస్యే వచ్చేది కాదు.
ప్రలోభ పెడుతున్నారని వార్డు సభ్యులు రిసార్ట్‌కు
కానీ సర్పంచ్ పదవిని ఎంజాయ్ చేయడం నేర్చుకున్న నాయర్ తాను దిగనంటే దిగనన్నారు. దీంతో అందరికీ గాడ్ ఫాదర్‌గా ఉండి గెలిపించిన ఆశ్రమ నిర్వాహకుడు భట్ రంగంలోకి దిగాడు. నాయర్‌కు నచ్చే చెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో.. తొలగించాలని ప్లాన్ చేశాడు. సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాడు. కానీ ప్రెసిడెంట్ నాయర్ అప్పటికే రాజకీయాల్లో రాటుదేలిపోయారు. మిగిలిన వార్డు సభ్యుల్ని సామ,బేద, దాన దండోపాయాలతో తన దారికి తెచ్చుకోవాలనుకున్నాడు. ఈ విషయం తెలిసిన భట్.. వెంటనే వారిని రిసార్టుకు పంపిచేసారు. ఎనిమిది వార్డు సభ్యుల్ని.. నలభై రోజుల పాటు ఆజ్ఞాతంలో ఉంచారు. వీరిలో ఐదుగురు మహిళా పంచాయతీ సభ్యులు కూడా ఉన్నారు.
అవిశ్వాసం రోజున సమీప ఎయిర్ పోర్టుకు విమానంలో వచ్చిన వార్డు సభ్యులు
తాజాగా సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం కోసం సమావేశానికి తేదీ ఖరారు చేశారు. ఆ సమయానికి చేరుకోవడానికి హుబ్బళ్లి ఎయిర్ పోర్టుకు విమానంలో తీసుకు వచ్చారు. విమానం ముందు వారు దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. చిన్న పంచాయతీ సర్పంచ్ పదవి నుంచి ఓ వ్యక్తిని దింపేసి.. మరో వ్యక్తికి కట్టబెట్టడానికి నలభై రోజుల పాటు తొమ్మిది మందిని రిసార్టులో పెట్టడం.. వారిని విమానంలో తీసుకు రావడం..హాట్ టాపిక్ అయింది. రాజకీయం ఏదైనా రాజకీయమేనని చర్చించుకోవాల్సి వచ్చింది.