Dental Doctor Kindapped in Rangareddy District: రంగారెడ్డి జిల్లాలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని తుర్కయంజాల్ మున్సిపాలిటి రాగన్నగూడలో పెళ్లి కూతూరు కిడ్నాప్ సంచలనంగా మారింది. దాదాపు 100 మంది యువకులు తమ ఇంటికి వచ్చి కుమార్తెను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. కొందరు గుర్తుతెలియని యువకులు ఇంటిపై దాడి చేసి, ఇల్లు పూర్తిగా ధ్వంసం చేశారని, వీరిని అడ్డుకునేందుకు చూసిన వారిపై సైతం దాడి చేసి యువతిని కిడ్నాప్ చేశారని సమాచారం. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏసిపి ఉమామహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటి రాగన్నగూడలోని ఓ ఇంట్లో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఇరు కుటుంబాలు సంతోషంగా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. అంతలో ఏం జరిగిందో తెలియదు.. సినిమా సీన్ తరహాలో కొందరు యువకులు డెంటల్ కోర్సు చేస్తున్న యువతి ఇంటికి చేరుకున్నారు. రావడంతోనే తమ చేతిలో ఉన్న కర్రలు, రాడ్లతో యువతి ఇంటి వద్ద ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. బంధువులు, చుట్టు పక్కల ఇళ్లవారు ఆ గుర్తుతెలియని యువకులను అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై సైతం దాడి చేసి గాయపరిచారు. యువతిని బలవంతంగా కిడ్నాప్ చేసి తమ వాహనాల్లో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది.
యువతి తల్లిదండ్రులు ఏమన్నారంటే..
తమ ఇంట్లో పెళ్లి వేడుకలు జరుగుతుండగా టీ టైం ఓనర్ నవీన్ రెడ్డి అనే యువకుడు కొందరు యువకులతో వచ్చి తమ ఇంటిపై దాడి చేశాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు డెంటల్ కోర్సు చేస్తుందని, కొందరు యువకులు ఒక్కసారిగా ఇంటిపై దాడి చేసి బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని తల్లిదండ్రుల ఆరోపించారు. తన కూతుర్ని కిడ్నాప్ చేసింది నవీన్ రెడ్డి అనే యువకుడని, ఎలాగైనా కూతుర్ని కిడ్నాపర్ల చెర నుంచి కాపాడాలంటూ బాధిత యువతి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. డెంటర్ డాక్టర్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్కడికి చేరుకుని పరిశీలించారు. యువతి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కిడ్నాపర్ ను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు. నిందితుల వివరాలు, సమాచారం కోసం ఆ ఏరియాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలని పోలీసులు పరిశీలిస్తున్నారు.