AP Registration Charges : గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం పెంచిన భూముల రిజిస్ట్రేషన్ ను విలువలను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల అధికంగా ఉన్న ధరలను తగ్గించగా.. మరి కొన్నిచోట్ల మాత్రం యథాతథంగా ఉంచారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సగటున రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా 20శాతం పెరిగాయి. నివాస స్థలాలు, వాణిజ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల ప్రాతిపదికన ఈ విలువను సవరించారు.
ప్రాంతాల వారిగా రిజిస్ట్రేషన్ విలువల్లో సవరణలు
విశాఖలోని పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. అనకాపల్లిలో ఈ ధరలు యథాతథంగా ఉండగా.. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం 24 నుంచి 32 శాతానికి పెంచారు. విజయవాడలో ఈ ఛార్జీలు 3 శాతం నుంచి 9 శాతం వరకు పెరిగాయి. ఇక కాకినాడలో కొన్ని ప్రాంతాలను వాణిజ్య ప్రాంతాలుగా గుర్తించి వైఎస్సార్సీపీ (YSRCP) హయాంలో గజం ధరను రూ.42 వేలుగా ఖరారు చేశారు. ఇప్పుడు దీన్ని రూ.22 వేలకు తగ్గించారు. అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. అదే తరహాలో గుంటూరు శివారు నల్లపాడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఎకరా పొలం రిజిస్ట్రేషన్ విలువ రూ.1.96 కోట్లు ఉండేది. ఇప్పడు దాన్ని ఏకంగా రూ.30 లక్షలకు పెంచారు. ఇక సుద్దపల్లి డొంకలోఎకరా పొలం రూ.4.35 కోట్లు ఉండగా దాన్ని రూ.1.99 కోట్లకు తగ్గించారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం జిల్లాలతో పాటు ఏలూరులోనూ ఈ ధరలను పెంచారు.
పెద్ద ఎత్తున నమోదైన రిజిస్ట్రేషన్స్
భూములు రిజిస్ట్రేషన్ (Land Registration) విలువలు పెరుగుతుందని తెలుసుకున్న చాలా మంది రెండు రోజుల ముందు నుంచే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు (Registration Offices) బారులు తీరారు. ధరలు పెరగకముందే తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. అంతమంది ఒకేసారి రిజిస్ట్రేషన్ల కోసం రావడంతో కొన్నిచోట్ల సర్వర్లు మొరాయించాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. పలు ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకూ కూడా రిజిస్ట్రేషన్ల నమోదు ప్రక్రియ కొనసాగింది. గడిచిన రెండు రోజుల్లోనే సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. గురువారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 14,250 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తెలుస్తోంది. అలా ఒక్కరోజులోనే ప్రభుత్వానికి రూ.107 కోట్ల వరకు ఆదాయం వచ్చింది.
సర్వర్ సమస్యలు, కార్యాలయాల వద్ద రద్దీ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల రాత్రి 11 గంటల వరకూ రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల నడవలేని వృద్ధులను కూడా ఆటోల్లో కార్యాలయాలకు తీసుకొచ్చి మరీ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఇంకొంతమందేమో భూముల రిజిస్ట్రేషన్లకు ముందుగానే చలాన్లు తీసినా సర్వర్ ప్రాబ్లెమ్, రద్దీ కారణంగా శుక్రవారం చేయించుకోలేకపోయారు. వీరికి పాత ధరలతో రిజిస్ట్రేషన్లు చేస్తారా లేదా కొత్త విలువలు అమలవుతాయా అన్న విషయాల్లో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
Also Read : Budget 2025 Agriculture Sector: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త, వ్యవసాయానికి నిర్మలమ్మ ఏం ఇచ్చిందంటే!