2024 సాధారణ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు అప్పుడే సన్నాహాలు ప్రారంభించాయి. ముఖ్యంగా దేశ స్థాయిలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలో జరిగిన తప్పులు మళ్లీ మళ్లీ జరగకుండా చూసుకుని ఈ సారి బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ సారి ప్రశాంత్ కిషోర్ దన్నుతో కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటోంది. కానీ ఈ సమావేశంలో ఓ వెలితి కనిపించింది. అదేమిటంటే తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల్లో ఒక్కటి కూడా హాజరు కాకపోవడం.
బీజేపీ వ్యతిరేక సమావేశాలకు వెళ్లని తెలుగు ప్రాంతీయ పార్టీలు..!
వరుసగా మూడో సారి గెలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు సోనియా గాంధీ కలసి వచ్చే విపక్ష పార్టీలన్నింటితో సమావేశం నిర్వహించారు. ఎస్పీ, బీఎస్పీ, ఆమ్‌ఆద్మీ పార్టీలు తప్ప మరో 19 పార్టీలు హాజరయ్యాయి. సమావేశానికి హాజరు కాకపోయినా ఆ పార్టీలది బీజేపీ వ్యతిరేకతే. అయితే ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల పార్టీలు కనిపించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు బీజేపీని కలసి కట్టుగా ఎదుర్కోవడానికి నిర్వహించిన సమావేశంలో పాల్గొనలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆహ్వానం కూడా రాలేదు.
కేంద్ర రాజకీయాల్లో తెలుగు ప్రాంతీయ పార్టీల స్థానం కీలకం..!
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో తెలుగు రాష్ట్రాలది ఎప్పుడూ ప్రముఖమైన స్థానమే. ఇప్పుడు రెండుగా విడిపోయింది కానీ ఉమ్మడి రాష్ట్రంలోనూ ఏపీలో గెలుపే కేంద్రంలో అధికారం చేపట్టడానికి కీలకంగా ఉండేది. గతంలో యూపీఏ రెండు సార్లు అధికారంలోకి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో లభించిన ఏపక్ష ఫలితాలే. వచ్చే సారి సంకర్ణం ఏర్పడాల్సిన పరిస్థితి వస్తే తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల అవసరం లేకుండా ప్రభుత్వ ఏర్పడటం అసాధ్యం. ఇంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కనిపిస్తున్నా తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు మాత్రం ఇప్పుడే జాతీయ రాజకీయాల్లో చురుకుగా మారడానికి సందేహిస్తున్నాయి.
బీజేపీని వ్యతిరేకించడానికి భయపడుతున్నారా..?
తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ .. ఈ మూడు పార్టీలూ బీజేపీకి వ్యతిరేకమే. బయటకు చెప్పేది అదే. కానీ బహిరంగ పోరాటానికి మాత్రం సిద్ధపడటం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. ఆ పార్టీపై యుద్ధమే అన్న టీఆర్ఎస్ అధినేత తర్వాత రాజీ లేదు.. రణం లేదనే విధానానికి వచ్చారు. బీజేపీతో ఢిల్లీలో స్నేహం.. గల్లీలో పోరాటం అనే విధానాన్ని పాటిస్తున్నారు. ఈ కారణంగానే టీఆర్ఎస్ విపక్షాల భేటీకి దూరంగా ఉన్నారని అనుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి లేకుండా ఆ పార్టీ రెబల్ నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కపిల్ సిబల్ నిర్వహించిన విపక్ష పార్టీల భేటీకి టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. కానీ సోనియా నిర్వహించిన భేటికి మాత్రం దూరంగా ఉన్నారు.
ఏపీలో రెండు పార్టీలకూ కమలం అంటే భయమేనా..?
ఇక ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రాంతీయ పార్టీలే అధికార, విపక్షాలుగా ఉన్నాయి. కానీ రెండు పార్టీలూ బీజేపీకి వ్యతిరేకంగా పోరడే విషయంలో వెనుకడుగు వేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయనేది బహిరంగరహస్యం. కేసుల భయమో... మరో కారణమో కానీ తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం మానేసింది. ఇక ఆ పార్టీకి వ్యతిరేకంగా పెట్టే సమావేశాలకు వెళ్లే పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో బహిరంగంగా కాంగ్రెస్‌తో జట్టు కట్టిన టీడీపీకి ఆ పార్టీ కూడా సమావేశాలకు ఆహ్వానం పంపడం లేదు. టీడీపీ వెళ్లడం లేదు.
చక్రం తిప్పే చాన్స్ వస్తే విశ్వరూపం చూపిస్తారు..!
రాజకీయాల్లో సమీకరణాలు బయటకు చెప్పినట్లుగా ఉండవు. లెక్కలేసినట్లుగా ఉండవు. రాజకీయాల్లో ఆరితేలిపోయిన తెలుగు రాష్ట్రాల నేతలకు ఇది బాగా తెలుసు. అందుకే తొందరపడటం ఎందుకని సైలెంట్‌గా ఉంటున్నారని అనుకోవచ్చు. కానీ చక్రం తిప్పే అవకాశమే వస్తే వారిని పట్టుకునే వారు ఎవరూ ఉండరని గత చరిత్రే చెబుతోంది.