పాకిస్థాన్.. పేరుకే మన పక్క దేశం. కానీ ఎప్పుడూ భారత్ పైన చాడీలు చెప్పడం, అంతర్జాతీయ వేదికలపై మనపై విషం కక్కడమే పని. కానీ తన సొంత ఇంటిని మాత్రం చక్కదిద్దుకోలేదు. ప్రస్తుతం పాక్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఎంతలా అంటే చివరకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవనాన్నే అద్దెకు ఇచ్చేంత స్థాయికి పడిపోయింది. అసలెందుకు ఈ పరిస్థితి నెలకొంది.


యూనివర్సిటీగా..


ఇమ్రాన్ ఖాన్ అధికారిక భవనం ఇస్లామాబాద్‌లో ఉంది. ఇదివరకు దీన్ని యూనివర్శిటీగా మార్చుతామని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (PTI) ప్రభుత్వం ప్రకటించింది. అది ఆచరణలోకి రాలేదు. అయితే ఉన్నట్టుండి ఈ భవనాన్ని అద్దెకు ఇస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఇందులో కల్చరల్, ఫ్యాషన్, ఎడ్యుకేషనల్, ఇతర ఈవెంట్లు జరుపుకోవడానికి ఇస్తారట. అంటే దాదాపు ఇదో ఈవెంట్స్ ఫంక్షన్ హాల్ కాబోతుందని సమాచారం.


కమిటీల ఏర్పాటు..


ఈ భవనాన్ని నడిపించేందుకు ప్రభుత్వం రెండు కమిటీలను వేసినట్లు పాకిస్థాన్ సామా టీవీ తెలిపింది. ఈవెంట్స్ పద్ధతిగా జరిగేలా చూసే బాధ్యత ఈ కమిటీలదే. ఈ భవనం నుంచి డబ్బులు ఎలా రాబట్టాలనే దానిపై త్వరలోనే కేబినెట్ సమావేశమై చర్చిస్తుందని స్థానిక మీడియా తెలిపింది. ఇక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు నిర్వహించుకునేందుకు అవకాశం ఇస్తారట. అంటే డాలర్లు, యూరోల రూపంలో డబ్బు కోట్లలో వస్తుంది.


ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని అయ్యాక ఆ దేశ ఆర్థిక స్థితి మరింత దిగజారింది. మూడేళ్లలో దేశ ఎకానమీ 19 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయితే ఇమ్రాన్ దేశ ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు పలు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు ఆలోచన చేశారు.


విదేశీ పర్యటనకు కూడా డబ్బుల్లేవ్..


2020లో ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం దావోస్ వెళ్లేందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు స్నేహితులు సహాయం చేయడం పాక్ ఆర్థిక వ్యవస్థ ఎంత దిగజారింది అనేందుకు నిదర్శనం. ఇమ్రాన్ దావోస్ వెళ్లేందుకు అవసరమయ్యే ఖర్చులు సర్కార్ భరించలేని స్థితిలో ఉండటంతో ఇద్దరు స్నేహితులు ఆ ఖర్చులు భరించినట్లు స్వయంగా ఇమ్రాన్ తెలిపారు.


దావోస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. వాళ్లు కనుక ఖర్చు పెట్టకపోయినట్లయితే తాను దావోస్ రాగలిగే వాడిని కాదన్నారు. ఈ సందర్భంగా తన స్నేహితులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఇక్కడ రెండు రాత్రులు గడిపేందుకు అయ్యే 4,50,000 డాలర్ల ఖర్చు భారాన్ని తమ ప్రభుత్వం మీద వేయలేనన్నారు. పాక్ ఆర్థిక పరిస్థితి వల్ల విదేశీ పర్యటనలపై ఇప్పటికీ నియంత్రణ విధించారు ఇమ్రాన్ ఖాన్. మంత్రులు ఎవరైనా విదేశాలకు వెళ్లాలన్నా కూడా అది దేశానికి ఉపయోగకరమైనదేనని ఇమ్రాన్ ను ఒప్పిస్తేనే వారికి అనుమతిస్తున్నారు.