President Murmu:  ఎర్రకోటపై దాడి కేసులో పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. 24 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఈ ఉగ్రదాడిలో పాక్ ఉగ్రవాదికి ఉరిశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. దీని తరువాత, ఉగ్రవాది ఆరిఫ్ తన ప్రాణాలను రక్షించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఇప్పుడు  రాష్ట్రపతి అతడి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించారు. అయితే, పాక్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్‌కు ఇంకా ఒక ఆప్షన్ మిగిలి ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం.. శిక్షను తగ్గించాలని కోరుతూ దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. 


పదవిలోకి వచ్చిన తర్వాత రెండవది  
దేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఎర్రకోటపై దాదాపు 24 ఏళ్ల క్రితం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టినప్పటి నుండి (25 జూలై 2022) ఇప్పటివరకు రెండు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. అంతకుముందు, 2022 నవంబర్ 3న పాకిస్థాన్ ఉగ్రవాది ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించి.. ఈ కేసులో అతనికి విధించిన మరణశిక్షను ధృవీకరించింది. దీని తర్వాత ఆరిఫ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష ప్రసాదించాలని పిటిషన్‌ను దాఖలు చేసుకున్నాడు.


ఆరిఫ్ కు ఓన్లీ ఆప్షన్
తొలుత ఉగ్రవాది ఆరిఫ్ రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించగా, తాజాగా రాష్ట్రపతి ముర్ము అతని క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. పాకిస్తాన్ ఉగ్రవాది ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్‌కు మరేదైనా చట్టపరమైన ఛాన్స్ ఉందా అనే ప్రశ్న పలువురిలో తలెత్తుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 (రాజ్యాంగ పరిష్కారాల హక్కు) ప్రకారం ఆరిఫ్ కోర్టులో తన శిక్షను తగ్గించమని కోరవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరణశిక్ష అమలులో జాప్యం కారణంగా అరిఫ్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు వీలుందని న్యాయ నిపుణులు తెలిపారు.


మే 15 పిటిషన్ స్వీకరణ 
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే 15న ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ క్షమాభిక్ష పిటిషన్‌ను స్వీకరించారు. ఆగస్టు 27న ఎర్రకోట దాడిలో దోషిగా తేలిన పాక్ ఉగ్రవాది క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించినట్లు రాష్ట్రపతి భవన్ సిబ్బంది ఆగస్టు 29న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 22 డిసెంబర్ 2000న ఉగ్రవాదులు ఎర్రకోటలోకి ప్రవేశించారు.  వారు రాజ్‌పుతానా రైఫిల్స్ సైనికులపై  కాల్పులు జరిపారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.  మహ్మద్ ఆరిఫ్ నిషేధిత లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)లో సభ్యుడు. శ్రీనగర్‌లో ఎర్రకోటపై దాడికి కుట్ర పన్నారు. ఈ దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులు - అబూ బిలాల్, అబూ షాద్, అబూ హైదర్ వేర్వేరు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు.