మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా నటించిన సినిమా 'ఖిలాడి'. ప్లే స్మార్ట్... అనేది ఉపశీర్షిక. ఆల్రెడీ విడుదలైన టీజ‌ర్‌లో రవితేజ రెండు భిన్నమైన గెట‌ప్స్‌లో కనిపించారు. సూటు, బూటు వేసుకుని స్ట‌యిలిష్‌గా ఉన్నారు. అలాగే, జైల్లో ఖైదీలానూ క‌నిపించారు. మిగతా మెయిన్ క్యారెక్టర్స్‌ను అలా అలా చూపించారు. ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఇది చూస్తే... సినిమా ఎలా ఉంటుందనేది ప్రేక్షకులకు ఒక ఐడియా వస్తుంది.


'ఖిలాడి' ట్రైలర్ చూస్తే... 'పేకాటలో నలుగురు కింగ్స్ ఉంటారు... ఈ ఆటలో ఒక్కడే కింగ్ (రవితేజ), 'మెటల్ డిటెక్టర్ లాగ ఇక్కడ మనీ డిటెక్టర్ ఉంటుంది' డైలాగులు బావున్నాయి. యాక్షన్ సీన్లు చాలా స్ట‌యిలిష్‌గా తీశారు. అన్నిటి కంటే ముఖ్యంగా మాస్ మహారాజ రవితేజ డైలాగ్స్, మీనాక్షీ చౌదరితో లిప్ లాక్ ఆడియ‌న్స్‌ను ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. హీరోయిన్లు ఇద్దరూ స్విమ్మింగ్ ఫూల్‌లో బికినీ షో చేశారు. ట్రైల‌ర్‌లో అనసూయకు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆమె బ్రాహ్మణ యువతి పాత్రలో కనిపించారు. సినిమా కథ అంతా డబ్బు చుట్టూ తిరుగుతుందని అర్థం అయ్యింది. అసలు ఆ డబ్బు ఎవరిది? ఎవరు కొట్టేశారు? రవితేజ రోల్ ఏంటి? అనేది ఆసక్తికరంగా ఉంది.






ఫిబ్రవరి 11న (ఈ శుక్రవారం) సినిమా విడుదల కానుంది. సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ లభించింది. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి  శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ మాటలు రాశారు. శ్రీమణి సాహిత్యం అందించారు. సుజిత్ వాసుదేవ్,  జీకే విష్ణు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రానికి కోనేరు సత్యనారాయణ నిర్మాత. జయంతి లాల్ గడ సమర్పకులు. 


రవితేజ సరసన మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్, సచిన్ ఖేడేకర్, ముఖేష్ రుషి, ఠాకూర్ అనూప్ సింగ్, రావు రమేష్ మురళీ శర్మ ప్రధాన తారాగణం.