రియల్‌మీ సీ35 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది. ఈ ఫోన్ థాయ్‌ల్యాండ్‌లో ఫిబ్రవరి 10వ తేదీన లాంచ్ కానుంది. గతేడాది మనదేశంలో లాంచ్ అయిన రియల్‌మీ సీ25కు తర్వాతి వెర్షన్‌గా రియల్‌మీ సీ35 లాంచ్ కానుంది.


ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రకటించింది. రియల్‌మీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో తెలిపిన పోస్టుల ప్రకారం.. రియల్‌మీ సీ35 ఫిబ్రవరి 10వ తేదీన థాయ్‌ల్యాండ్‌లో లాంచ్ కానుంది. దీని లాంచ్ ఈవెంట్‌ను ఫేస్‌బుక్ పేజీలో లైవ్ చూడవచ్చు.


బ్లాక్, గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


రియల్‌మీ సీ35 స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించనున్నారు. యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండే అవకాశం ఉంది.


ఇందులో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉండనుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ లెన్స్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 సెన్సార్ ఉండనుంది.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం కూడా ఇందులో ఉంది. ఈ ఫోన్ ధర 5,799 థాయ్‌ల్యాండ్ బాత్‌లుగా (సుమారు రూ.13,150) ఉండే అవకాశం ఉంది. ఇక రియల్‌మీ జీటీ 2 సిరీస్, రియల్‌మీ నార్జో 50 కూడా త్వరలో మనదేశంలో లాంచ్ కానుంది.