Ratna Bhandar Opening Today: పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాన్ని (ratna bhandar) తెరిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆలయంలో హైలెవల్ కమిటీ సమావేశం జరిగింది. జస్టిస్ విశ్వనాథ్ అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. మధ్యాహ్నం 1గంట తరవాత భాండాగారాన్ని తెరిచేందుకు అంతా సిద్ధం చేశారు. హైలెవల్ కమిటీ పర్యవేక్షణలోనే (Puri Jagannath Temple) ఈ ప్రక్రియ జరుగుతుంది. 1978లో తొలిసారి ఈ భాండాగారాన్ని తెరిచారు. మళ్లీ 46 ఏళ్ల తరవాత ఇవాళే తెరుస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా దీనిపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ్టి నుంచి (జులై 14) ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమక్షంలో లోపలి సంపదను లెక్కించనున్నారు. అయితే..ఈ గదిలో సంపదకు నాగబంధనం ఉందని, లోపలికి వెళ్తే ప్రమాదమని కొందరు భయపెడుతున్నారు. అంతే కాదు. లోపలి నుంచి ఏవేవో వింత శబ్దాలు వినిపిస్తున్నాయనీ చెబుతున్నారు. అసలు ఈ రహస్య గది తలుపులు తెరుచుకుంటాయో లేదో అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఆలయ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయేలా ఈ ప్రక్రియను చేపడతామని జస్టిస్ రథ్ వెల్లడించారు.
ఇప్పటికే ఈ ప్రక్రియకు (ratna bhandar mystery) సంబంధించి రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గదిని తెరిచేందుకు స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ని అనుసరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సమావేశంలో అధికారులకు కీలక సూచనలు చేసింది. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని ఆదేశించింది. 1985లో రత్న భాండాగారాన్ని తెరిచినప్పుడు దాదాపు 70 రోజుల పాటు లోపలి ఆభరణాలని లెక్కించారు. బంగారం, వెండితో పాటు వజ్రాలనూ కనుగొన్నారు. ఈ ఆభరణాలు లెక్క తేల్చి ఓ జాబితా తయారు చేశారు. అప్పటి నుంచి మళ్లీ దీనిపై ఎక్కడా చర్చ జరగలేదు. అయితే...అన్ని రోజుల పాటు లెక్కించినా లోపలి సంపదపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సారి ఈ లెక్కంతా తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. పైగా మరమ్మతులు చేయించాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. లోపల పాములు ఉంటాయన్న ప్రచారంతో ముందుగానే అప్రమత్తమైంది. స్నేక్ క్యాచర్స్‌నీ లోపలికి పంపనుంది. పొరపాటున ఎవరికైనా పాము కరిచినా వెంటనే స్పందించి వైద్యం అందించేందుకు డాక్టర్‌లనీ అందుబాటులో ఉంచనుంది.
అసలు ఈ భాండాగారం గురించి ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చర్చ జరగనే లేదు. ఎప్పుడైతే ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ దీని గురించి ప్రస్తావించారో అప్పటి నుంచి మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. భాండాగారం తాళం పోగొట్టారని మోదీ ఆరోపించారు. ఆ తాళాన్ని తమిళనాడుకి పంపించారని ఆరోపించారు. ఈ వివాదంపై స్పందించిన అప్పటి ఒడిశా ప్రభుత్వం డూప్లికేట్ తాళం ఉందని స్పష్టం చేసింది. 2018లో తెరిచేందుకు ప్రయత్నించినా పాములున్నాయన్న భయంతో ఆ ఆలోచన మానుకున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మాత్రం కచ్చితంగా తెరవాల్సిందేనని పట్టుబట్టి మరీ ఆదేశాలిచ్చింది. అయితే...ఆభరణాలు వెలికి తీసి వాటిని ఏం చేస్తారు..? వాటికి భద్రత ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.