YSRCP MLA Prakash Reddy: రాప్తాడు: దొంగ ఓట్ల విషయంలో YSRCP ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేస్తున్న నాటకాలు ఆపాలని మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ వారివి డబుల్ ఓట్లు ఉన్నాయంటూ ఆయన చేస్తున్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. డబుల్, దొంగ ఓట్ల మీద విచారణ మీ గ్రామం నుంచి మీ ఇంటి నుంచే ప్రారంభిద్దామని తాను గతంలోనే సవాల్ విసిరానని గుర్తు చేశారు. తాను విసిరిన సవాల్ పై స్పందించకుండా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి రోజుకో కొత్తరకం నాటకం ఆడుతున్నారంటూ పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. 


బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కనగానపల్లిలో ఆమె మూడవ రోజు పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని సూపర్ సిక్స్ పథకాలు తీసుకొచ్చారని ఇప్పటికే వీటిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తో పాటు వారి అనుకూల పత్రికలో ప్రచురితమైన వార్తల మీద ఆమె తీవ్రంగా స్పందించారు.  ప్రకాష్ రెడ్డి చదువుకున్న వ్యక్తిగా చెప్పుకుంటూ ఉంటారని కానీ దొంగ ఓట్లు విషయంలో ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే నటిస్తున్నారా లేక అర్థం కాక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 


తెలుగుదేశం పార్టీకి చెందిన వారివైనా లేక వైసీపీకి చెందిన వారి వైన చాలా చోట్ల రెండు ఓట్లు ఉంటాయని వీటి విషయంలో ఓటర్ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ఒకచోట మాత్రమే ఉంచాలన్నది తమ డిమాండ్ అన్నారు. అలా కాకుండా అధికార పార్టీ వైసీపీ నాయకులు బీఎల్వోల ద్వారా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఇష్టానుసారంగా తొలగిస్తున్నారని ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న పనంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ పర్మిషన్ లేకుండా రెండు చోట్ల ఓట్లు ఎలా తొలగిస్తారని ఆమె నిలదీశారు. మీ స్వగ్రామం తోపుదుర్తి గ్రామంలో 380 ఓట్లు వేరే ప్రాంతం వారి ఉన్నాయని అవి ఎక్కడి నుంచి వచ్చాయని ఆమె నిలదీశారు. అలాగే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మీద రెండేసి ఓట్లు ఉన్నాయని వాటి మీద స్పందించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 


దొంగ ఓట్లు ఉంటే ఏ పార్టీ వారివైనా తొలగించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. మీకు సంబంధించిన కొంతమంది యువకుల ద్వారా ఆధార్ కార్డులు మార్ఫింగ్ చేసి 18 ఏళ్లు నిండకుండానే మీకు అనుకూలంగా ఉన్న వారి ఓట్లను ఎలా చేరుస్తున్నారో మాకు సమాచారం ఉందన్నారు. ఈ వివరాలన్నింటినీ త్వరలోనే బయటపెడతానని పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధార్ కార్డు మార్పింగ్ అన్నది ఎంత పెద్ద నేరమో ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. నిజాయితీ ఉంటే ఇప్పటికైనా నకిలీ ఓట్ల మీద విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.