Rajya Sabha MP Raghav Chadha : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో కీలక నేతగా, అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు, పార్టీ నాయకత్వానికి మధ్య విభేదాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై చద్దా ఓ ప్రకటనచేశారు. తనపై ఒక పథకం ప్రకారం స్క్రిప్టెడ్ క్యాంపెయిన్ జరుగుతోందని విమర్శించారు.
రాఘవ్ చద్దాను రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఈ వివాదం ముదిరింది. ఆయన స్థానంలో అశోక్ కుమార్ మిట్టల్‌ను నియమించిన పార్టీ, రాజ్యసభ సెక్రటేరియట్‌కు ఒక లేఖ రాస్తూ.. ఆప్ కోటాలో రాఘవ్ చద్దాకు మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని కోరింది. దీనిపై చద్దా స్పందిస్తూ, నన్ను నిశ్శబ్దంగా ఉంచగలరేమో కానీ, ఓడించలేరు అంటూ ఒక వీడియో విడుదల చేశారు. తాను ప్రజా సమస్యలను లేవనెత్తుతుంటే పార్టీ ఎందుకు అడ్డుకుంటోందని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యంగా తనపై వస్తున్న మూడు ప్రధాన ఆరోపణలను చద్దా కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు వాకౌట్ చేసినప్పుడు తాను సభలోనే కూర్చుంటున్నానన్నది పచ్చి అబద్ధమని, సీసీటీవీ ఫుటేజ్ చూస్తే నిజం తెలుస్తుందని సవాల్ చేశారు. అలాగే, ప్రధాన ఎన్నికల కమిషనర్ తొలగింపు పిటిషన్‌పై సంతకం చేయలేదన్న ఆరోపణపై స్పందిస్తూ.. పార్టీ నుంచి తనకు అలాంటి విజ్ఞప్తి రాలేదని, పైగా పార్టీలోని 10 మంది ఎంపీల్లో 6-7 మంది కూడా సంతకం చేయలేదని, కేవలం తననే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని ప్రశ్నించారు.
మరోవైపు ఆప్ నాయకత్వం చద్దాపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు చద్దా లండన్‌లో ఉండి పార్టీకి దూరంగా ఉన్నారని, క్లిష్ట సమయంలో పార్టీకి అండగా నిలవలేదని ఆరోపిస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం స్పందిస్తూ.. చద్దా కాంప్రమైజ్ అయ్యారని, సీరియస్ రాజకీయ అంశాలను వదిలి కేవలం సాఫ్ట్ పీఆర్ కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. పంజాబ్ వ్యవహారాల్లో ఆయన అతిగా జోక్యం చేసుకుంటున్నారనే అసంతృప్తి కూడా పార్టీలో ఉంది.
ప్రస్తుతం రాఘవ్ చద్దా తన సోషల్ మీడియా బయో నుంచి AAP పేరును తొలగించారు. కేవలం రాజ్యసభ ఎంపీ అని మార్చుకున్నారు. ఆయన త్వరలోనే బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, చద్దా ఆ విషయాన్ని ధృవీకరించలేదు. గాయపడిన సింహం మరింత ప్రమాదకరం అనే డైలాగ్‌తో ఆయన ఇచ్చిన హెచ్చరిక, ఆప్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.
