Basara temple Development:  తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి ఆలయ రూపురేఖలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్షించారు. సుమారు రూ. 225 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ముఖ్యమంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలని, పనులన్నీ అత్యంత అద్భుతంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాలని సూచించారు.       

 పర్యావరణహిత క్షేత్రంగా బాసర                    

ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా బాసరను ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, పర్యావరణహిత క్షేత్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆలయ పరిసరాల్లో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను  మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తులో పెరగనున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు, అధునాతన క్యూ కాంప్లెక్స్‌లు, ఘాట్‌ల విస్తరణ వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఆలయ పవిత్రతను కాపాడే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, నిబంధనలను కఠినతరం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.  

గోదావరి పుష్కరాల  నాటికి ఈ పనులన్నీ పూర్తి                                 

ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రాజకీయాలకు తావులేకుండా తిరుమల తరహాలో కఠిన నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాసర ఆలయ పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, భక్తులకు పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలని సూచించారు. గోదావరి పుష్కరాల  నాటికి ఈ పనులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.        

సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన                 

ఈ నెల 6వ తేదీన  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసరలో పర్యటించి, ఈ భారీ అభివృద్ధి పనులకు అధికారికంగా శంకుస్థాపన చేయనున్నారు. రూ. 225 కోట్లతో ప్రారంభమయ్యే ఈ పనుల ద్వారా ఆలయ గర్భాలయం, రాజగోపురాలు, మడ వీధులు మరియు భక్తుల వసతి సౌకర్యాలను అత్యాధునికంగా అభివృద్ధి చేయనున్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయ కారిడార్‌ను పర్యాటక హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.