Rajya Sabha Elections 2024: రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. గుజరాత్‌ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను బరిలోకి దింపింది. మహారాష్ట్రలో ఊహించిందే జరిగింది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం, సీనియర్ నేత అశోక్ చవాన్‌కి అవకాశమిచ్చింది. జేపీ నడ్డా ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అయితే....అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ జేపీ నడ్డాని నిలబెడితే గెలిచే అవకాశముండదని భావించిన హైకమాండ్..ఆయనను గుజరాత్‌ నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించుకుంది. అటు అశోక్ చవాన్‌ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన వెంటనే ఆయనకు రాజ్యసభ టికెట్ ప్రకటించింది అధిష్ఠానం. మహారాష్ట్రలో కాంగ్రెస్‌కి షాక్‌ల మీద షాక్‌లు తగిలాయి. అశోక్ చవాన్‌ కన్నా ముందు బాబా సిద్దిఖీ, మిలింద్ దియోర ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. సిద్దిఖీ అజిత్ పవార్ NCPలో చేరారు. దియోర ఏక్‌నాథ్ శిందే వర్గమైన శివసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సారి విడుదల చేసిన జాబితాలో గుజరాత్‌ నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. గుజరాత్‌లో జేపీ నడ్డాతో పాటు గోవింద్ భాయ్ ధోలాకియా, మయంక్‌భాయ్ నాయక్, డాక్టర్ జశ్వంత్‌సిన్హ్ పర్మర్‌కి అకాశమిచ్చింది. అటు మహారాష్ట్రలో అశోక్ చవాన్‌తో పాటు మేధా కులకర్ణి, డాక్టర్ అజిత్ గోప్‌చద్దేలను అభ్యర్థులుగా ప్రకటించింది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ని ఒడిశా నుంచి బరిలోకి దింపనుంది బీజేపీ.

  







కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికలకు సిద్ధమైంది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో సోనియా గాంధీ కూడా ఉన్నారు. ఆమె తెలంగాణలో లోక్‌సభకు పోటీ చేస్తారన్న వార్తలు వచ్చినా...ఆమె రాజ్యసభకు పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. రాజస్థాన్ నుంచి సోనియా బరిలోకి దిగుతున్నారు. ఆమెతో పాటు బిహార్ నుంచి డాక్టర్ అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి శ్రీ అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హండోర్‌ని అభ్యర్థులుగా ప్రకటించారు. త్వరలోనే తెలంగాణ నుంచి అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. సోనియా గాంధీ ఇప్పటికే రాజస్థాన్‌ నుంచి నామినేషన్ వేశారు. జైపూర్‌ నుంచి ఆమె నామినేషన్ వేసినట్టు ప్రకటించారు. ఈ సమయంలో సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారు. 1998 నుంచి 2022 వరకూ సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ బాధ్యతలు చేపట్టారు. ఐదు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు.  ఫిబ్రవరి 8వ తేదీనే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఫిబ్రవరి 15వ తేదీతో నామినేషన్‌ల స్వీకరణ గడువు ముగిసిపోతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 20 ఆఖరు తేదీ. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ ఓటింగ్ కొనసాగుతుంది.


Also Read: కేరళకు చెందిన జంట అమెరికాలో అనుమానాస్పద మృతి, ఇద్దరు చిన్నారులు కూడా