Rajouri Encounter:
కశ్మీర్‌లో రాజ్‌నాథ్ సింగ్
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలో ఉగ్రవాదులు, ఆర్మీ మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్ర కదలికలు తగ్గుముఖం పట్టాయనుకుంటున్న తరుణంలో మరోసారి అలజడి రేపింది ఈ ఘటన. దీనిపై కేంద్రం కూడా సీరియస్ అయింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంటనే జమ్ముకశ్మీర్ పర్యటన వెళ్లారు. అక్కడి పరిస్థితులు సమీక్షిస్తున్నారు. ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా సమీక్షించనున్నారు. నార్తన్ ఆర్మీ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇప్పటికే ఈ సమీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్కడ చేపట్టే ఆపరేషన్‌లపై రాజ్‌నాథ్ సింగ్‌కు కమాండర్‌లు వివరించనున్నారు. గ్రౌండ్ జీరో వద్ద కీలక చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం రెండు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. బారాముల్లాతో పాటు రాజౌరిలో సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని హతమార్చారు. పేలుడు పదార్థాలతో పాటు AK 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదాన్ని సహించేదే లేదని తేల్లి చెబుతున్న కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలే తీసుకుంటోంది. ఇండియన్ ఆర్మీ కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఉగ్రస్థావరాలను గుర్తించి వారిని మట్టుబెడుతోంది.