Ashok Gahlot vs Sachin Pilot: 


అవినీతిపై చర్యలు లేవు: పైలట్ 


రాజస్థాన్‌లో మరోసారి పైలట్ వర్సెస్ గహ్లోట్ ఫైట్ మొదలైంది. సీఎం కుర్చీలో కూర్చోవాలని కలలు కంటున్న సచిన్ పైలట్...గహ్లోట్‌పై ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మొదలవడం అధిష్ఠానాన్ని టెన్షన్ పెడుతోంది. ఎలాగైనా గహ్లోట్‌ను గద్దె దింపి...సీఎం పదవిని హస్తగతం చేసుకోవాలని చూస్తున్న పైలట్...ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తానంటూ ప్రకటించారు. గతంలో వసుంధర రాజే ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఇంత వరకూ గహ్లోట్ స్పందించలేదని, అందుకే నిరాహార దీక్షకు దిగుతున్నాటని స్పష్టం చేశారు పైలట్. 


"ఏప్రిల్ 11వ తేదీన ఒక రోజు పాటు నిరాహార దీక్ష చేస్తాను. రాష్ట్రంలో అవినీతిపరులపై ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలా అయితేనే ప్రజలకు మాపై నమ్మకముంటుంది. కేవలం పని చేస్తున్నామని కాకుండా వాళ్ల హామీలు నెరవేరుస్తున్నామన్న భరోసా వస్తుంది" 


- సచిన్ పైలట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే 


గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వీటిపై సీబీఐ విచారణ కూడా జరిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 


"అవినీతిపై మా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై మైనింగ్ స్కామ్ ఆరోపణలు వచ్చాయి. అయినా దీనిపై CBI విచారణ జరపడం లేదు. లలిత్ మోదీపైనా ఎలాంటి చర్యలు లేవు. ఇలా అయితే ప్రజలకు తప్పుడు సందేశం ఇచ్చిన వాళ్లమవుతాం. మా ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ఎన్నో హామీలిచ్చాం. అవినీతిని అడ్డుకుంటామని భరోసా కల్పించాం. కానీ ఇప్పుడది జరగడం లేదు. దీనిపై నిరసనగానే నేను నిరాహార దీక్ష చేస్తాను. ఇప్పటి వరకూ ప్రభుత్వం చేయని పనులన్నీ చేయాలన్నదే నా లక్ష్యం" 


-  సచిన్ పైలట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే 






విభేదాలు 


సచిన్ పైలట్, గహ్లోట్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై గహ్లోట్‌ను ప్రశ్నించగా.."అదేం లేదు. మేమిద్దరం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం" అని బదులిచ్చారు. పార్టీ అన్నాక నేతల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉంటాయని అన్నారు. ఏదేమైనా ఈ విభేదాలు మాత్రం అధిష్ఠానానికి తలనొప్పి తెచ్చి పెడుతోంది. పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నికైన వెంటనే రాజస్థాన్ రాజకీయాల్లో మార్పులు వస్తాయని భావించారంతా. కానీ...అక్కడ పరిస్థితులు ఏమీ చక్కబడ లేదు. ఆ మధ్య ఓ సారి వీళ్లిద్దరినీ కలిపే ప్రయత్నం చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. పైగా...అధిష్ఠానం కూడా గహ్లోట్‌నే సపోర్ట్ చేస్తున్నట్టు సమాచారం. అందుకే...ఈ విభేదాలు సమసిపోవడం లేదని అంటున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు. 


Also Read: Project Tiger 50 Years: దేశంలో 3 వేలు దాటిన పెద్ద పులుల సంఖ్య, భారత్ కృషిని ప్రశంసించిన ప్రధాని