Latest Weather Report : తెలంగాణలో గురువారం వాతావరణంపై భారత వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన గాలి వాన పడుతుందని పేర్కొంది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. హైదరాబాద్‌తోపాటు తెలంగామలో 17జిల్లాల్లో ఇది పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

హైదరాబాద్‌లో వాతావరణం Hyderabad Weather Reportహైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో వాతావరణం చాలా భిన్నంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ మండిపోనుంది. సాయంత్రం తర్వాత వాతావరణం చల్లబడుతుంది. దీంతో సాయంత్రం వేళలలో కానీ, రాత్రి సమయంలో కానీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. వర్షం కురిసే టైంలో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులు జనాలను భయపెట్టనున్నాయి. 

వాతావరణంలో మార్పులు కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. ఉదయం పూట ఆకాశం మబ్బులు పట్టి ఉక్కపోతగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అందుకే ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల నుంచి 38 డిగ్రీల మధ్య రిజిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది.  

తెలంగాణ వ్యాప్తంగా ఈ వారంలో అక్కడక్కడ వర్షాలు పడినప్పటికీ మిగతా ప్రాంతాల్లో మాత్రం భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దాదాపు 22 జిల్లాల్లో 40కిపైగా ఉష్ణోగ్రతలు రిజిస్టర్ అయినట్టు ఐఎండీ పేర్కొంది. ఇలాంటి టైంలో పడిన వర్షం ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించింది. అయితే రైతులకు మాత్రం అకాల వర్షం నిండా ముంచింది. 

ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు:- జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనంకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యపేట, నల్గొండ

ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు:- హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి మెదక్, ఉమ్మడి వరంగల్, మహబూబాబాద్ 

ఈ ప్రాంతాలలో అప్పుడప్పుడు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి చిరు జల్లుల వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

ఉదయం ఎండలో తిరిగినప్పుడు కానీ, సాయంత్రం వర్షం పడే సమయంలో బయటకు వచ్చే ప్రజలకు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములతో కూడిన వర్షాల సమయంలో బహిరంగ ప్రదేశాలను ఉండొద్దని హెచ్చరిస్తున్నారు. 

వర్షాలు కారణంగా వేడి కాస్త తగ్గొచ్చేమో కానీ ఉష్ణోగ్రతలు మాత్రం రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నట్టు తెలిపింది. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 42.7 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది. దాదాపు 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైంది. హైదరాబాద్‌లో పగటపూట ఉష్ణోగ్రత 38 డిగ్రీలకుపైనే ఉంటుందని పేర్కొన్నారు.  

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం(Andhra Pradesh Weather)బంగాళాఖాతంలోని అల్పపీడనం 24 గంటల్లో బలహీనపడుతుంది. వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో గురువారం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉంది.

శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

ఆంధ్రప్రదేశ్‌లో 17 మండలాల్లో గురువారం వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శుక్రవారం 7  మండలాల్లో తీవ్ర, 66 మండలాల్లో స్వల్పంగా వడగాలులు వీచేందుకు అవకాశం ఉందన్నారు.

బుధవారం కర్నూలు జిల్లా ఉలిందకొండలో40.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగలో40.3డిగ్రీలు, చిత్తూరు జిల్లా  తవణంపల్లెలో40.1 డిగ్రీలు, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 39.9 డిగ్రీలు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేట, నంద్యాల జిల్లా దొర్నిపాడు, పల్నాడు జిల్లా అమరావతిలో 39.7 డిగ్రీల  చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు.