Rahul US Visit: 



అమెరికా పర్యటన..


అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌పై వరుస పెట్టి విమర్శలు చేస్తున్నారు. ప్రధాని మోదీ దేవుడికైనా ఉపదేశాలివ్వగలడు అంటూ సెటైర్లు వేసిన ఆయన...ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్‌లో వ్యాపారవేత్తలతో సమావేశమైన ఆయన...మళ్లీ పెగాసస్‌ వైరస్‌ ప్రస్తావన తీసుకొచ్చారు. తన ఫోన్ ట్యాపింగ్‌కి గురవుతోందని తెలిసినా ఏమీ చేయలేకపోయానని స్పష్టం చేశారు. స్టార్టప్‌ల ప్రతినిధులతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో మాట్లాడిన రాహుల్....ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో పాటు కొత్త టెక్నాలజీల గురించి ప్రస్తావించారు. డేటాని గోల్డ్‌తో పోల్చిన ఆయన..ఇండియా ఈ విషయంలో ఎంతో సామర్థ్యాన్ని సాధించిందని తెలిపారు. ఇదే సమావేశంలో బిగ్‌డేటా,మెషీన్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్స్‌తోనూ చర్చించారు. డేటా భద్రత విషయంలో కొన్ని లొసుగులున్నాయని, కేంద్రం వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. డేటా ప్రొటెక్షన్‌కి కచ్చితమైన నిబంధనల అవసరముందని అభిప్రాయపడ్డారు. 


"ప్రపంచమంతా ఇప్పుడు డేటా చుట్టూనే తిరుగుతోంది. ప్రస్తుతానికి ఇదే బంగారం. ఈ విషయంలో భారత్‌ చాలా రిచ్‌గా ఉంది. కాకపోతే...ఆ డేటాకి భద్రత లేకుండా పోతోంది. పెగాసస్‌ వైరస్‌ ఇందుకు ఉదాహరణ. నా ఫోన్‌ ట్యాపింగ్‌కి గురవుతోందని నాకు అర్థమైపోయింది. నా ఐఫోన్‌ ట్యాప్ అయింది. ఒకవేళ ప్రభుత్వమే అధికారికంగా నీ ఫోన్‌ని ట్యాప్ చేయాలని ఫిక్స్ అయితే...ఏమీ చేయలేం. నా ఫోన్ ట్యాప్ అయినప్పుడు నాకిదే అర్థమైంది. అయినా...ఈ విషయంలో నేను ప్రభుత్వంతో యుద్ధం చేయదలుచుకోలేదు. ట్యాప్ చేస్తే చేయనివ్వండి. అప్పుడు నేనేం చేస్తున్నానో ప్రభుత్వానికి  ఓ క్లారిటీ వస్తుంది"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 






ఈ వ్యాఖ్యలు చేసిన వెంటేన రాహుల్ చేసిన పనికి హాల్‌లోని వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఆ తరవాత నవ్వుకున్నారు. ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ ఉన్నట్టుండి తన ఐఫోన్‌ తీసి "హలో మిస్టర్ మోడీ" అని అన్నారు. పరోక్షంగా మోదీయే తన ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు రాహుల్. ఇదే సమావేశంలో అనర్హతా వేటు గురించీ మాట్లాడారు. 


"ఓ పరువు నష్టం కేసులో ఇంత పెద్ద శిక్ష పడ్డ వ్యక్తిని నేనొక్కడినే అనుకుంటా. ఎంపీగా అనర్హత వేటు వేశారు. అయినా...నాకు పొలిటికల్‌గా ఇది చాలా మంచి చేసింది"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 


శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ యూనివర్సిటీలో NRI సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రధాని మోదీ సర్కార్‌పైనా విమర్శలు చేశారు. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడాన్నీ ప్రస్తావించారు. ఇందుకు పార్టీ అనుసరించిన వ్యూహాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. 2024 ఎన్నికల్లోనూ ఇదే స్ట్రాటెజీతో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ భేటీలో పలు ప్రశ్నలు ఎదుర్కొన్న రాహుల్...విపక్షాల ఐక్యతపైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 


"ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడం పెద్ద కష్టమైన పనేం కాదు. కాకపోతే...ప్రతిపక్షాలన్నీ ఓ పద్ధతి ప్రకారం ఒక్కటవ్వాలి. బీజేపీలోనూ కొన్ని లొసుగులున్నాయి. వాటిని పట్టుకోగలిగి, ప్రతిపక్షాలు సరైన విధంగా ఒక్కటి కాగలిగితే సులువుగానే ఆ పార్టీని ఓడించొచ్చు. కర్ణాటక ఎన్నికల్లో ఏం జరిగిందో చూశారుగా. బీజేపీతో నేరుగా పోరాడాం. గెలిచాం. కానీ...అందుకు మేం ఫాలో అయిన మెకానిజం ఏంటో అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. భారత్ జోడో యాత్ర ప్రభావం ఆ ఎన్నికలపై స్పష్టంగా కనిపించింది. అక్కడి ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా బీజేపీ 10 రెట్లు ఎక్కువగా ఖర్చు పెట్టింది"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 


Also Read: TCS Work From Office: ఆఫీస్‌కి రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్ - ఉద్యోగులకు టీసీఎస్ వార్నింగ్