ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా.. దేశంలోని వ్యక్తులు, సంస్థలపై 'పెగాసస్' స్పైవేర్‌తో నిఘా పెట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఇది పూర్తిగా రాజద్రోహమేనని కేంద్రాన్ని దుయ్యబట్టారు. పెగాసస్ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని తెలిపారు. దీనికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పెగాసస్ వ్యవహారంపై కేంద్రం సమాధానం చెప్పాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలన్నారు.
ఈ సందర్భంగా పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలపైనా రాహుల్ స్పందించారు. ప్రస్తుతం సమస్య సద్దుమణిగిందని తెలిపారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం ముఖాముఖీగా కలుసుకున్న కొద్ది సేపటికే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సిద్ధూ నేడు పీసీసీ చీఫ్‌గా అధికారిక బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి అమరీందర్ హాజరయ్యారు. ఇందులో కెప్టెన్, సిద్ధూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడం విశేషం.
పెగాసస్ దుమారం..
సంచలనం సృష్టిస్తోన్న హ్యాకింగ్ వ్యవహారానికి సంబంధించి స్పైవేర్ లక్షిత జాబితాలో రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖ రాజకీయ నేతల ఫోన్ నంబర్లు ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, బంగాల్ ఎన్నికల్లో దీదీకి విజయం అందించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఫోన్లపైనా హ్యాకింగ్ జరిగినట్లు ది వైర్ వార్తా సంస్థ కథనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పార్లమెంటు సమావేశాల్లోనూ ఈ విషయంపై విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి.