Rahul Gandhi Passport: కాంగ్రెస్ అగ్రనేతకు ఆర్డినరీ పాస్‌పోర్టు కోసం ఢిల్లీ హైకోర్టు అనుమతిని ఇచ్చింది. అమెరికా పర్యటనకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్న తరుణంలో కోర్టు రాహుల్ గాంధీకి ఊరట కల్పించింది. మూడేళ్ల కాలానికి గానూ పాస్‌పోర్టు జారీకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసింది ఢిల్లీ కోర్టు. దీంతో కొత్త పాస్‌పోర్టు పొందేందుకు రాహుల్ కు దారులు తెరుచుకున్నాయి. 'మోదీ ఇంటి పేరు' వ్యాఖ్యల కేసులో కోర్టు రాహుల్ కు రెండు ఏళ్ల జైలు శిక్ష వేసిన విషయం తెలిసిందే.


అనంతరం లోక్‌ సభలో ఆయన సభ్యత్వంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన లోక్‌ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అలా ఆయనకు ఉన్న డిప్లోమాటిక్ పాస్‌ పోర్టును అధికారులకు అప్పగించారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ సాధారణ పాస్ పోర్టు కోసం అప్లై చేసుకున్నారు. అయితే బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదుతో నమోదైన నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో 2015 నుంచి రాహుల్ బెయిల్ పై ఉన్నారు. దీంతో పాస్‌పోర్టు జారీ కోసం ఎన్‌వోసీ కోరుతూ రాహుల్.. ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను సుబ్రహ్మణ్య స్వామి వ్యతిరేకించారు. 


'బెయిల్ ఇస్తూ ప్రయాణ ఆంక్షలు విధించలేదు'


రాహుల్ గాంధీ పిటిషన్ పై ఢిల్లీ కోర్టు రెండు రోజుల పాటు విచారణ జరిపింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ కు బెయిల్ ఇస్తూ.. ఎలాంటి ప్రయాణ ఆంక్షలు విధించ లేదని కోర్టు తెలిపింది. దీనిపై వాదనలు వినిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. రాహుల్ ఎన్‌వోసీ పిటిషన్ ను వ్యతిరేకించారు. రాహుల్ కు పాస్‌పోర్టు ఇస్తే నేషనల్ హెరాల్డ్ కేసుపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాదించారు. సుబ్రహ్మణ్య స్వామి చేసిన వాదనలు విన్న న్యాయస్థానం.. వాటిని లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. తాజాగా శుక్రవారం మరోసారి ఢిల్లీ కోర్టు విచారణ జరిపింది. సుబ్రహ్మణ్య స్వామి చేసిన వాదనలు తిరస్కరించింది. రాహుల్ గాంధీకి నిరభ్యంతర పత్రాన్ని ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. అయితే, ఆయన కోరినట్లు 10 సంవత్సరాలకు కాకుండా.. మూడేళ్ల కాలానికి ఎన్‌వోసీ జారీ చేస్తున్నట్లు తీర్పులో పేర్కొంది. 


ఈనెల 31 నుంచి పది రోజుల పాటు అమెరికాలో రాహుల్ గాంధీ పర్యటన


కాగా.. రాహుల్ గాంధీ ఈనెల 31వ తేదీ నుండి 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. జూన్ 4వ తేదీన న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభతో పాటు వాషింగ్టన్, కాలిఫోర్నియాలోని పలు కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.