Rahul Gandhi:


జైశంకర్ నేతృత్వంలో భేటీ..


రాహుల్ గాంధీ యూకే స్పీచ్‌పై దాదాపు వారం రోజులుగా బీజేపీ,కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాహుల్ తప్పకుండా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తోంది బీజేపీ. కాంగ్రెస్ మాత్రం ససేమిరా అంటోంది. అయితే...పార్లమెంటరీ ప్యానెల్ మీటింగ్‌లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. విదేశాంగ మంత్రి జైశంకర్ G20 సదస్సుపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలోనే పలువురు బీజేపీ ఎంపీలు ఉన్నట్టుండి రాహుల్ వ్యాఖ్యల ప్రస్తావన తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ మేరకు రాహుల్ వివరణ కూడా ఇచ్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించినంత మాత్రాన తనపై యాంటీ నేషనల్ ముద్ర వేయడం సరికాదని చెప్పారట. అంతే కాదు. భారత్ అంతర్గత వ్యవహారాల్లో విదేశాలను జోక్యం చేసుకోవాలన్న వ్యాఖ్యలనూ తప్పుదోవ పట్టించారని అన్నారు. వాళ్లు ఆ సమస్యకు పరిష్కారం చూపుతారేమో అన్న ఆలోచన తప్ప మరే ఉద్దేశమూ లేదని వివరించినట్టు తెలుస్తోంది. జైశంకర్...G20 సదస్సుపై పూర్తిస్థాయిలో చర్చించిన తరవాత ఓ బీజేపీ ఎంపీ రాహుల్ వ్యాఖ్యల ప్రస్తావన తీసుకొచ్చారట. మొదట్లో రాహుల్ మాట్లాడలేదని, ఆ తరవాత బీజేపీ ఎంపీలు ఒకరి తరవాత ఒకరు ప్రస్తావించాక..అప్పుడు ఆయన వివరణ ఇచ్చారట. ఈ వివరణ ఇచ్చేందుకు ఇది సరైన వేదిక కాదని కొందరు వారించినప్పటికీ...ప్రతిపక్ష ఎంపీలు రాహుల్‌కు అండగా నిలబడ్డారని సమాచారం. ఆయనకు మాట్లాడే హక్కు ఉందని తేల్చి చెప్పారు. ఒక్కసారిగా వివాదం ముదరడం వల్ల విదేశాంగ మంత్రి జైశంకర్‌ అందరినీ వారించారట. ఇవన్నీ పార్లమెంట్‌లోనే మాట్లాడుకోవాలని సూచించారని తెలుస్తోంది.