Raghuram Rajan Political Entry: 


పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ..


ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాజకీయాల్లోకి వస్తున్నారా..? ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారుతోంది. డిసెంబర్ 14వ తేదీన భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీతో కలిసి నడిచారు రఘురాం. రాజస్థాన్‌లో జరిగిన యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటర్వ్యూ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. రాజకీయ, ఆర్థిక రంగాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎకనామిక్ టైమ్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. రఘురామ్ రాజన్ మరోసారి భారత్ జోడో యాత్ర గురించి ప్రస్తావించారు. రాజకీయాల్లోకి వచ్చే విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. "భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిన అవసరం కనబడింది. అందుకే రాహుల్‌తో కలిసి నడిచాను" అని స్పష్టం చేశారు. భారత్‌కు ఉన్న ఒకే ఒక బలం ప్రజాస్వామ్య వ్యవస్థ అని అన్నారు. అయితే...ప్రస్తుతం దేశంలో మత సామరస్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. "ఈ దేశ పౌరుడిగా...ఇక్కడి సమస్యలు తెలిసిన వాడిగా భారత్ జోడో యాత్రలో పాల్గొన్నాను" అని వెల్లడించారు రఘురాం. ఇదే సమయంలో పొలిటికల్ ఎంట్రీపైనా క్లారిటీ ఇచ్చారు. "రాజకీయాల్లో వస్తారా" అన్న ప్రశ్నకు బదులిచ్చారు. "రాజకీయాల్లోకి
వచ్చే ఆలోచనే ఏ మాత్రం లేదు. కేవలం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు" అని స్పష్టం చేశారు. రాజస్థాన్‌లోని జోడో యాత్రలో రఘురామ్ రాజన్.. నడుస్తూనే రాహుల్‌ గాంధీ పలు అంశాలపై చర్చించారు.






గతంలో రాహుల్ గాంధీ కూడా రఘురాం రాజన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు పడిపోతుందని చెప్పారు రఘురాం. వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని అన్నారు. ద్రవ్యోల్బణమూ పెరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు నుంచి మోదీ సర్కార్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రఘురామ్ రాజన్ బహిరంగంగానే విమర్శలు చేశారు. నోట్ల రద్దును వ్యతిరేకించడంలో కాంగ్రెస్‌కు రఘురామ్‌ రాజన్‌ మద్దతిచ్చారు. ఇలాంటి నిర్ణయాల వల్ల దీర్ఘకాల ప్రయోజనాలకు ఆటంకం కలుగుతుందని తాను రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌లో చేరతారా..? అన్న సందేహం కూడా తెరపైకి వచ్చింది. మొత్తానికి ఆయనే స్వయంగా స్పందించి రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టతనిచ్చేశారు. 


Also Read: Covid-19 Scare China: ఇది ఆరంభం మాత్రమే అసలు కథ ముందుంది, జనవరిలో కేసుల సునామీ - చైనాలో కొవిడ్‌పై నిపుణుల హెచ్చరికలు