Rafale Fuselage To Be Made In Hyderabad: హైదరాబాద్‌కు ప్రతిష్టాత్మకమైన పెట్టుబడి వస్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ కింద భారతదేశ రక్షణ తయారీ రంగంలో ఓ కీలక ప్రాజెక్టు హైదరాబాద్ లో ఏర్పాటు కావడానికి రంగం సిద్ధమయింది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL), ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం డస్సాల్ట్ ఏవియేషన్‌తో నాలుగు కీలకమైన ఉత్పత్తి బదిలీ ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ ఒప్పందాలు రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూజ్‌లేజ్ భాగాలను స్థానికంగా తయారు చేయడానికి అవకాశం కల్పిస్తాయి. ఈ విడి భాగాలు ఇప్పటివరకు ఫ్రాన్స్‌లో మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. భారతదేశంలో ఒక ఖచ్చితమైన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి గణనీయమైన పెట్టుబడిని పెడతామని దసాల్ట్ ఏవియేషన్ ప్రకటించింది. ఇది ప్రపంచ ఏరోస్పేస్ సప్లై చైన్‌లో కీలకంగా మారుతుంది. ఈ ఒప్పందంలో భాగంగా టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ హైదరాబాద్‌లో అత్యాధునిక ఫ్యాక్టరీని నిర్మిస్తుంది. ఈ ప్లాంట్ రాఫెల్ యుద్ధ విమానానికి అవసరం అయిన ఫ్యూజ్‌లేజ్ షెల్‌లతో సహా రాఫెల్ జెట్ ప్రధాన ఫ్యూజ్‌లేజ్ విభాగాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ భాగాలు యుద్ధ విమానంలో ప్రధానభాగంగా ఉంటాయి. తేలికైన మన్నికను నిర్ధారిస్తూ, వివిధ వ్యవస్థలను అనుసంధానించే ఫ్రేమ్‌వర్క్‌గా ఈ విడిభాగాలుపనిచేస్తాయి. 2028 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ ప్లాంట్ నెలకు రెండు పూర్తి ఫ్యూజ్‌లేజ్ యూనిట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. “భారతదేశంలో మా సప్లై చైన్‌ను బలోపేతం చేయడంలో ఇది నిర్ణయాత్మక దశ. భారత రక్షణ పరిశ్రమ రంగంలో కీలకమైన TASLతో సహా మా స్థానిక భాగస్వాముల విస్తరణకు ధన్యవాదాలు" అని దస్సాల్ట్ ప్రకటించింది. హైదరాబాద్ ప్లాంట్ రాఫెల్ విడిభాగాల ఉత్పత్తి రక్షణ రంగ పరిశ్రమల ముఖ చిత్రాన్ని మార్చనుంది.
TASL CEO , MD సుకరణ్ సింగ్ భారతదేశ రక్షణ రంగానికి ఒక మైలురాయిగా ఈ ఒప్పందాన్ని అభివర్ణించారు. "భారతదేశ ఏరోస్పేస్ రక్షణ ఉత్పత్తుల ప్రయాణంలో ఈ భాగస్వామ్యం ఒక ముఖ్యమైన అడుగు. భారతదేశంలో పూర్తి రాఫెల్ ఫ్యూజ్‌లేజ్ ఉత్పత్తి టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సామర్థ్యాలపై పెరుగుతున్న నమ్మకాన్ని, డస్సాల్ట్ ఏవియేషన్‌తో మా సహకారం బలాన్ని నమ్ముతోంది. ప్రపంచ వేదికలకు మద్దతు ఇవ్వగల ఆధునిక, బలమైన ఏరో స్పేస్ తయారీ ఎకో సిస్టమ్‌ను స్థాపించడంలో భారతదేశం సాధించిన అద్భుతమైన పురోగతిని కూడా ఇది ప్రతిబింబిస్తుంది" అని సుకరణ్ సింగ్ ప్రకటించారు.