Quetta Bomb Blast:
బలూచిస్థాన్‌లో దాడి..
పాకిస్థాన్‌లో బాంబుల మోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ ఘటన మర్చిపోక ముందే మరోటి జరుగుతోంది. ఇటీవలే పెషావర్‌లో ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. దానిపై విచారణ జరుగుతున్న సమయంలోనే బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా ప్రాంతంలో మరో దాడి జరిగింది. పోలీస్ పోస్ట్‌కు సమీపంలోనే ఈ దాడి జరగటం కలవరం సృష్టిస్తోంది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు తీవ్రంగా గాయపడినట్టు పాక్ మీడియా తెలిపింది. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న సైనికులు, పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని తెహరీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ప్రకటించుకుంది. ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. భద్రతా అధికారులను టార్గెట్‌గా చేసుకుని దాడికి పాల్పడినట్టు వెల్లడించింది. మూసా చౌకీలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్టు స్థానికులు చెప్పారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానిక మీడియా కూడా ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.