పంజాబ్ ముఖ్యమంత్రి స్థానాన్ని భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే పార్టీ అధిష్ఠానం.. సీనియర్ నేత అంబికా సోనీకి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. కానీ ఇందుకు ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్‌జిందర్ సింగ్ రంధావా పేరును పరిశీలిస్తోంది పార్టీ అధిష్ఠానం. అత్యధిక మంది ఎమ్మెల్యేలు కూడా సుఖ్‌జిందర్ సింగ్ రంధావాను సీఎం పదవికి ప్రతిపాదించినట్లు సమాచారం.
ఎమ్మెల్యేల ప్రతిపాదనపై దిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
కెప్టెన్ రాజీనామా..
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు పెద్ద షాక్ అని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటివరకు అంతర్గత కలహాలు ఉన్నా సద్దుకుపోయిన అమరీందర్.. ఎట్టకేలకు రాజీనామా చేశారు. అయితే తదుపరి సీఎం పదవికి రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ సునీల్ జాఖర్ వైపు పార్టీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అమరీందర్ సింగ్.. పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన స్ఖానంలో సీఎం పదవికి సిద్ధూను ఎంపిక చేస్తే అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఆయనకు ఆ అర్హత లేదని వ్యాఖ్యానించారు.
" నవజోత్ సింగ్ సిద్ధూ.. ఓ అసమర్థుడు. ఆయనను సీఎంగా ఎంపిక చేస్తే అది చాలా ప్రమాదకరం. తదుపరి సీఎం పదవికి సిద్ధూ పేరును నేను వ్యతిరికిస్తా. ఆయనకి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయి. ఇది జాతీయ భద్రతకే ముప్పు. "