అలాంటి పనులు చేసిన వాడు టెర్రరిస్టే కదా: ఎంపీ సిమ్రన్ జిత్ సింగ్
పంజాబ్ ఎంపీ సిమ్రన్‌జిత్ సింగ్ మన్...భగత్‌సింగ్‌పై వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుడైన భగత్‌సింగ్‌ను టెర్రరిస్ట్‌తో పోల్చుతూ ఆయన కామెంట్ చేయటంపై అన్ని రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. అమృత్‌సర్‌లో శిరోమణి అకాలీ దళ్ చీఫ్‌గానూ ఉన్నారు సిమ్రన్ జిత్ సింగ్. "భగత్‌సింగ్ ఓ యువ నేవీ అధికారిని చంపాడు. ఓ సిక్కు కానిస్టేబుల్‌నీ హతమార్చాడు. నేషనల్ అసెంబ్లీలో బాంబు విసిరాడు. ఈ పనులు చేసిన వాడు టెర్రరిస్ట్ కాకపోతే మరింకేంటి" అని ఆయన అన్నారు. ఇప్పుడే కాదు. నిత్యం ఈ ఎంపీ వివాదాల్లోనే ఉంటారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మన్ సొంత నియోజకవర్గం సంగ్రూర్‌లో గెలుపొందారు సిమ్రన్ జిత్ సింగ్. ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదమయ్యాయి. తన విజయాన్ని ఖలిస్థానీ మిలిటెంట్ జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలేకు అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. కశ్మీర్‌లో భారత సైన్యం వేధింపుల గురించి పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని అన్నారు.
ఇది సిగ్గుచేటు..భగత్‌సింగ్‌కు తీరని అవమానం: ఆప్
బిహార్, ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల నెపంతో గిరిజనులను చంపుతున్నారని, ఈ విషయాన్నీ పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని గతంలో వెల్లడించారు సిమ్రన్ జిత్ సింగ్. ఇక ఈ కొత్త వివాదంపై ఆప్ తీవ్రంగా మండి పడుతోంది. ఆప్ అధిష్ఠానంతో పాటు పంజాబ్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని
తీవ్రంగా పరిగణించింది. సిమ్రన్ జిత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. స్వాతంత్య్ర ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన యోధుడి
గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఇది సిగ్గుచేటు. భగత్‌సింగ్‌ను టెర్రరిస్ట్‌గా పోల్చి ఆయనను అవమానించారు. పంజాబ్ ప్రజలందరూ భగత్ సింగ్ సిద్ధాంతాలను విశ్వసిస్తారు. ఈ వ్యాఖ్యల్ని మేం ఖండిస్తున్నా" అని ఆప్ ట్వీట్ చేసింది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ట్విటర్ వేదికగా స్పందించారు. "భగత్‌సింగ్‌ను ఇలా పోల్చటం సిగ్గు చేటు. ఆయన ఓ హీరో. ఇంక్విలాబ్ జిందాబాద్" అని పోస్ట్ చేశారు.