కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ లేఖ రాశారు. ఈ నెల 15న సోనియా గాంధీకి రాసిన నాలుగు పేజీల లేఖలోని వివరాలను సిద్ధూ ఈ రోజు ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 13 పాయింట్ల ఎజెండాతో కూడిన పంజాబ్ మోడల్‌ను రూపొందించానని, దానిని వివరించేందుకు తనకు సమయం కేటాయించాలని ఆ లేఖలో సోనియాను సిద్ధూ కోరారు.
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ సింగ్ చన్నీ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాల్సిన ప్రాధాన్యతా క్రమాలను ఆ లేఖలో సిద్ధూ ప్రస్తావించారు. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ పునరుద్ధరణకు ఇది చివరి అవకాశంగా పేర్కొన్నారు.
లేఖలో అంశాలు..
వ్యవసాయం, విద్యుత్, ఉద్యోగాలు, డ్రగ్స్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసిన దుండగులను శిక్షించాలి.
వెనుకబడిన వర్గాల సంక్షేమం, ఇసుక మైనింగ్, కేబుల్ మాఫియాల గురించి సిద్ధూ ప్రస్తావన.
వెనక్కి తగ్గిన సిద్ధూ..
ఇటీవల పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన సిద్ధూ ఆ తర్వాత వెనక్కి తగ్గారు. అధిష్ఠానం చర్చలు జరపడంతో తన నిర్ణయాన్ని సిద్ధూ వెనక్కి తీసుకున్నారని పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగుతారని సీనియర్ నేత హరీశ్ రావత్ ప్రకటించారు.
" పంజాబ్, పంజాబ్ కాంగ్రెస్‌కు సంబంధించి నా సమస్యలను అధిష్ఠానానికి స్పష్టంగా చెప్పాను. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా అది కాంగ్రెస్, పంజాబ్ మంచి కోసమే. వారి ఆదేశాలే నాకు శిరోధార్యం. "
Also Read: Punjab Congress Crisis: సోనియా గాంధీకి సిద్ధూ లేఖాస్త్రం.. ఇదే చివరి అవకాశమని వ్యాఖ్య
Also Read: హైదరాబాద్‌లో ఉల్టా సీన్.. యువకుడి న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్ మెయిల్
Also Read: భర్త నిద్రిస్తుండగా అక్కడ వేడి వేడి నీళ్లు పోసిన భార్య