పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చరణ్‌జిత్ సింగ్ చన్నీ మీడియాతో మాట్లాడారు. సీఎం అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు చెబుతూనే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఓ 'ఆమ్‌ఆద్మీ' (సామాన్యూడు) అని ఈ సందర్భంగా చన్నీ అన్నారు. ప్రజల బాధలు, సమస్యలను తీర్చడానికి ఓ సామాన్యుడిలానే అర్థం చేసుకుంటానన్నారు.
కాంగ్రెస్ ఓ సామాన్యుడిని ఈరోజు ముఖ్యమంత్రిని చేసింది. పంజాబ్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంది. కొత్త సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని మేం కోరుతున్నాం. రైతుల నీటి, విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తాం. పంజాబ్ ప్రజల కోసం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఎంతో కృషి చేశారు. ఆయన వదిలిపెట్టిన చోటి నుంచే మేం అభివృద్ధి కొనసాగిస్తాం. సీఎం, కేబినెట్ కంటే పార్టీనే సుప్రీం. పార్టీ సిద్ధాంతాల ప్రకారమే మా ప్రభుత్వం పని చేస్తుంది. - చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ సీఎం
భావోద్వేగం..
తన నేపథ్యం గురించి చెబుతూ ఒకానొక సందర్భంలో చన్నీ భావోద్వేగం చెందారు. తన తండ్రి ఓ రిక్షావాలా అని, తల్లి చుట్టుపక్కల ఇళ్లలో పని చేసేవారని అలానే తనని పోషించారని చన్నీ అన్నారు. పంజాబ్ ప్రజల జీవిత ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
చన్నీ స్పీచ్‌లో కీ పాయింట్స్..
- ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలుస్తామని.. కొత్త సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని చన్నీ డిమాండ్ చేశారు.
- రైతుల కోసం ఇంతకుముందు కూడా తాను నిలబడ్డానని.. రైతుల బాధలు తీర్చేందుకు ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.
- ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రైతుల నీటి, విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
- పంజాబ్‌లో బలపడేందుకు చూస్తోన్న ఆమ్‌ఆద్మీని దృష్టిలో పెట్టుకొని తాను ఓ సామాన్యుడినని చన్నీ అన్నారు. పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు. సెలబ్రెటీ నుంచి రాజకీయనేతలు, సామాన్యుల వరకు అందరికీ రూల్స్ ఒకేలా ఉంటాయని చన్నీ స్పష్టం చేశారు.
- అటు అమరీందర్ సింగ్ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసిస్తూనే కాంగ్రెస్ అధిష్ఠానమే అంతిమమన్నారు చన్నీ.
- తాను ఓ సామాన్యుడికి ప్రతినిధినని ఈ సందర్భంగా చన్నీ అన్నారు. ధనవంతులు, ఇసుకదందాలు, అక్రమాలకు పాల్పడేవారు తన వద్దకు రావొద్దని చన్నీ తేల్చిచెప్పారు.