Heavy Rains in Pune: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లనీ నీళ్లతో నిండిపోయాయి. ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎడతెరపి లేకుండా వాన పడుతుండడం వల్ల ప్రభుత్వం అప్రమత్తమైంది. స్కూల్స్‌కి సెలవులు ప్రకటించింది. పుణేలో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పుణేతో పాటు కొల్హాపూర్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. పలు అపార్ట్‌మెంట్‌లలో వరద నీరు భారీగా చేరుకుంది. వరద నీళ్లలో నడుస్తుండగా ముగ్గురికి కరెంట్ షాక్‌ తగిలి చనిపోయారు. సహాయక చర్యలు చేపట్టేందుకు మూడు NDRF బృందాలు రంగంలోకి దిగాయి. పలు చోట్ల నడుము లోతు నీళ్లు చుట్టు ముట్టాయి. అక్కడి నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 




మరో 48 గంటల పాటు అన్ని పర్యాటక ప్రాంతాలనూ మూసివేయాలని పుణే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మునిగిపోయే ప్రమాదమున్న వంతెనలపై వాహనాల రాకపోకలు సాగించకుండా ఆంక్షలు విధించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. ఖడక్‌వస్లా డ్యామ్‌ పూర్తిగా నిండిపోయింది. ముతా నదీ తీరంలో ఉన్న ప్రజల్ని అధికారులు అలెర్ట్ చేశారు. అటు ముంబయిలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. అందేరీ వద్ద సబ్‌వే పూర్తిగా నీట మునిగింది. ఫలితంగా ఆ దారినంతా మూసేశారు. మహారాష్ట్రకు ఇప్పటికే IMD రెడ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని హెచ్చరించింది.