ISRO News: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. PSLV C-58 రాకెట్ ద్వారా ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం(EXPO SAT)ని కక్ష్యలో ప్రవేశ పెట్టేందుకు రెడీ అయింది. ఈ ప్రయోగం కొత్త ఏడాది మొదటి రోజు అంటే 2024 జనవరి-1న జరుగుతుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఇస్రో ఈ ప్రయోగం చేపడుతోంది. దీనికి సంబంధించి ఈ ఏడాది చివరి రోజు.. అంటే ఈరోజు(డిసెంబర్-31)న కౌంట్ డౌన్ మొదలైంది. 






 


కౌంట్ డౌన్ మొదలు.. 


ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించి ఈరోజు ఉదయం 8.10 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది. శనివారం రాకెట్‌ సన్నద్ధత (MRR), లాంచ్‌ ఆథరైజేషన్‌ సమావేశాలు ముగిశాయి. రాకెట్‌ అనుసంధానం, ఉపగ్రహ అమరిక, పరీక్షలు తదితర అంశాలపై శాస్త్రవేత్తలు చర్చించారు. అనంతరం కౌంట్ డౌన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈరోజు ఉదయం 8.10 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 25 గంటలపాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగుతుంది. సోమవారం(జనవరి-1) ఉదయం 9.10 గంటలకు ప్రయోగం మొదలవుతుంది. PSLV C-58 వాహకనౌక షార్‌ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్తుంది. ఇది EXPO SAT తోపాటు కేరళ యూనివర్శిటీ విద్యార్ధులు రూపొందించిన విఐవై (VIY) నానోశాట్‌ ని కూడా ను కక్ష్యలో ప్రవేశపెడుతుంది. 


EXPO SAT విశేషాలు..


బరువు 418 కిలోలు


జీవితకాలం 5 సంవత్సరాలు


టెలిస్కోప్ లా పనిచేస్తుంది


అంతరిక్ష రహస్యాలను పరిశోధిస్తుంది. 


బ్లాక్ హోల్స్, పాలపుంతలు, ఎక్స్ రే కిరణాలపై పరిశోధనకి ఉపయోగపడుతుంది






 


EXPO SAT గురించి మరింత సమాచారం.. 


EXPO SAT భారతదేశ అంతరిక్ష ఆధారిత ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సమాచారాన్ని పంపిస్తుంది. ఈ రంగంలో ఇది ఓ సంచలనాత్మక పురోగతికి నాంది పలుకుతుందని అంటున్నారు. ఇమేజింగ్‌, టైం-డొమైన్‌ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఇస్రో చెబుతోంది. గతంలో కూడా ఇలాంటి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించినా.. ఆ మిషన్ల మాదిరిగా కాకుండా, ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందని అంటున్నారు. ఎక్స్‌-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్‌ లక్ష్యంగా పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. భూ ఉపరితలానికి 650 కిలోమీటర్ల ఎత్తులో ఈ శాటిలైట్ ని ప్రవేశపెడతారు. 


60వ ప్రయోగం..


ఇప్పటి వరకు పీఎస్ఎల్వీ ప్రయోగాలు 59 జరిగాయి. ఇందులో 60వ ప్రయోగం జనవరి-1న జరగబోతోంది. ఇప్పటి వరకు పోలార్ శాటిలైట్ లాంచి వెహికల్ ప్రయోగాలు పీఎస్ఎల్వీకి బాగా అచ్చొచ్చాయి. ఈ ఏడాది కూడా మొదటి రోజు పీఎస్ఎల్వీతోనే ప్రయోగాలను ప్రారంభిస్తోంది ఇస్రో. ఇది కూడా విజయవంతమవుతుందనే ధీమా భారత శాస్త్రవేత్తల్లో ఉంది. PSLV C-58 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరుగుతుంది.