Priyanka Gandhi speech on Operation Sindoor: పహల్గాంలో భద్రతా సిబ్బంది ఎందుకు లేరని పార్లమెంట్ లో ప్రియాంకా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్ పై జరిగిన చర్చలో ప్రియాంకా ప్ర్సంగించారు. పహల్గామ్‌లోని బైసరన్ వ్యాలీ, పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందినప్పటికీ, అక్కడ ఒక్క భద్రతా సిబ్బంది కూడా ఎందుకు లేరో కేంద్రం చెప్పాలన్నారు. ఈ దాడి జరగడానికి గల కారణాలను ప్రభుత్వం వివరించలేకపోయిందని, ఇది భద్రతా, నిఘా వైఫల్యాన్ని సూచిస్తుందని ఆమె ఆరోపించారు. “ఇంత పెద్ద ఉగ్రదాడి జరగబోతుందని, పాకిస్థాన్‌లో కుట్ర జరుగుతుందని ఏ ఏజెన్సీకి తెలియలేదా?” అని ఆమె నిలదీశారు. దాడి సమయంలో భద్రతా సిబ్బంది లేరని ఉగ్రదాడిలో చనిపోయిన శుభం ద్వివేదీ భార్య స్పష్టం చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.
ఈ భద్రతా వైఫల్యానికి ఎవరూ బాధ్యత వహించలేదని, హోం మంత్రి సహా ఎవరూ రాజీనామా చేయలేదని ఆమె విమర్శించారు. “పౌరుల భద్రత ప్రధాన మంత్రి, హోం మంత్రి, రక్షణ మంత్రి బాధ్యత కాదా?” అని ఆమె సూటిగా ప్రశ్నించారు. పహల్గామ్‌లో భద్రత, తక్షణ వైద్య సహాయం లేకుండా పౌరులను “దేవుని దయకు” వదిలేశారని, వారిని “అనాథల్లా” వదిలేశారని ఆరోపించారు. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఉగ్రవాదం, చారిత్రక సందర్భాల గురించి విస్తృతంగా మాట్లాడారని.. కానీ పహల్గామ్ దాడికి నిర్దిష్ట కారణాలను మాత్రం వివరించలేదన్నారు. ఆమె విమర్శించారు.
ఆపరేషన్ సిందూర్ టైమింగ్, ఉద్దేశాలపై ఆమె ప్రశ్నలు సంధించారు . తదనంతర కాల్పుల విరమణ, అమెరికా పాత్రపై పారదర్శకత లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారు రాజకీయ పావులు కాదని దేశపుత్రులన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల వారి జీవితాలు కోల్పోయారని స్పష్టం చేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీలను ప్రస్తావిస్తూ మాట్లాడటం ద్వారా ప్రభుత్వం బాధ్యత నుండి తప్పుకుందని, “మీరు గతం గురించి మాట్లాడితే, మేం వర్తమానం గురించి మాట్లాడతాం” అని ఆమె కౌంటర్ ఇచ్చారు. పహల్గామ్ దాడి, మణిపూర్ హింస, ఢిల్లీ అల్లర్ల వంటి హోం మంత్రి అమిత్ షా పదవీ కాలంలో జరిగిన సంఘటనలపై ఆమె ఘాటు విమర్శలు చేశారు.