Priyanka Gandhi: రాయ్‌బరేలీ, అమేథి నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేస్తారో చివరి నిముషం వరకూ తేల్చకుండా సస్పెన్స్‌ని కంటిన్యూ చేసింది. ఆఖర్లో రాహుల్ గాంధీ పేరుని ప్రకటించింది. రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని వెల్లడించింది. ఆ సమయంలోనే ప్రియాంక గాంధీ పేరు కూడా గట్టిగానే వినిపించింది. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీయే బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు మాత్రమే మొగ్గు చూపుతున్నారు. అయితే..ఎందుకు ఎన్నికలకు దూరంగా ఉన్నారన్న ప్రశ్నకు ప్రియాంక గాంధీ సమాధానమిచ్చారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. రాహుల్‌తో పాటు తానూ పోటీ చేసి ఉంటే అది బీజేపీకి కలిసొస్తుందని స్పష్టం చేశారు. ఇద్దరూ పోటీ చేస్తే ఆ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ప్రచారం చేయాల్సి ఉంటుందని, మిగతా ప్రాంతాల్లో క్యాంపెయిన్ చేయడానికి వీలుండదని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలంటే పోటీ ఇద్దరిలో ఒకరు పోటీ చేయకుండా ఉంటేనే మంచిదని భావించినట్టు వివరించారు. ఇదే సమయంలో రాయ్‌బరేలీతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రియాంక.
"రాయ్‌బరేలీలో దాదాపు 15 రోజుల పాటు ప్రచారం చేశాను. ఈ నియోజకవర్గంతో గాంధీ కుటుంబానికి విడదీయలేని అనుబంధముంది. ఇక్కడి ప్రజలు మేము రావాలని వాళ్లతో మాట్లాడాలని కోరుకుంటారు. ఎక్కడో కూర్చుని ఇక్కడ ఎన్నికల్లో గెలవాలంటే కుదరదు కదా. అందుకే రాహుల్‌తో పాటు నేను కూడా ప్రచారం చేశాను"
- ప్రియాంక గాంధీ
కేరళలోని వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీలో పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ. మొన్నటి వరకూ సోనియా గాంధీ ఇక్కడి నుంచే ఎంపీగా ఉన్నారు. అయితే...ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని వైదొలగుతున్నట్టు తెలిపారు. రాజ్యసభ నుంచి ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె తప్పుకున్నాక రాహుల్ గాంధీ తొలిసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే...భవిష్యత్‌లో అయినా పోటీ చేసే అవకాశముందా అని అడిగిన ప్రశ్నకి ప్రియాంక బదులిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన తనకు ఎప్పుడూ లేదని, పార్టీ కోసం పని చేయడమే ఇష్టం అని వెల్లడించారు. ప్రజలు కోరుకుంటే తప్ప బరిలోకి దిగనని స్పష్టం చేశారు.
"ఎంపీగానో ఎమ్మెల్యేగానో నన్ను నేను చూసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎన్నికల్లో పోటీ చేయాలనీ అనుకోవడం లేదు. నాకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా సరే పార్టీ కోసం పని చేస్తాను. ఒకవేళ ప్రజలు నేను పోటీ చేయాలని కోరుకుంటే అప్పుడు నిర్ణయం తీసుకుంటాను"
- ప్రియాంక గాంధీ
పోటీ చేసేందుకే భయపడుతున్నారంటూ బీజేపీ సెటైర్లనూ కొట్టి పారేశారు ప్రియాంక. ఇద్దరమూ పోటీ చేస్తే బీజేపీని ఎదుర్కోడానికి తమకు అవకాశం ఉండేది కాదని, ఆ ఛాన్స్‌ని ఆ పార్టీకి ఇవ్వాలనుకోలేదని స్పష్టం చేశారు. రాయ్‌బరేలీ, అమేథి నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ ఎప్పుడూ తప్పుకోదని వెల్లడించారు.
Also Read: Saudi Arabia: హద్దులు చెరిపేస్తున్న సౌదీ అరేబియా, చరిత్రలోనే తొలిసారి స్విమ్‌వేర్ ఫ్యాషన్ షో