Prince Harry Killed 25 People:


పదేళ్లు బ్రిటీష్ ఆర్మీలో..


ప్రిన్స్ హ్యారీ ఒకప్పుడు బ్రిటీష్ ఆర్మీలో పదేళ్ల పాటు పని చేశాడు. అయితే...ఆ సమయంలో తాను 25 మందిని చంపినట్టు తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు హ్యారీ. ఇదే విషయాన్ని బ్రిటీష్ మీడియా వెల్లడించింది. త్వరలోనే ప్రిన్స్  హ్యారీ తన ఆటోబయోగ్రఫీ  బుక్‌ని విడుదల చేయనున్నారు. దీని పేరు "Spare" ఇందులోనే ఈ సంచలన విషయం  చెప్పారు. "అఫ్ఘనిస్థాన్‌లో అపాచీ హెలికాప్టర్ పైలట్‌గా పని చేసిన రోజుల్లో 25 మందిని చంపాను" అని తన బయోగ్రఫీలో రాసుకున్నట్టు బ్రిటీష్ మీడియా రిపోర్ట్ చేసింది. 38 ఏళ్ల ప్రిన్స్ హ్యారీ..తాలిబన్లకు
వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్స్‌లో పాల్గొన్నారు. 2007-08 మధ్య కాలంలో ఫార్వర్డ్ ఎయిర్ కంట్రోలర్‌గా తాలిబన్లపై ఎయిర్‌స్ట్రైక్స్  చేశాడు. ఆ తరవాత 2012-13 లోనూ హెలికాప్టర్‌తో తాలిబన్లపై బాంబుల వర్షం కురిపించారు. వచ్చే వారం ప్రిన్స్ హ్యారీ ఆటోబయోగ్రఫీ "స్పేర్" పుస్తకం విడుదల కానుంది. పైలట్‌గా దాదాపు ఆరు ఆపరేషన్లు నిర్వహించినట్టు అందులో రాశారు. ఈ కారణంగా..అంతమంది ప్రాణాలు తీయాల్సి వచ్చిందని చెప్పాడు. ఈ విషయంలో గర్వం లేదని, అలా అని బాధ కూడా లేదని అన్నారు. శత్రువులను మట్టుబెట్టడాన్ని చెస్‌ బోర్డ్‌పై పీసెస్‌ (కాయిన్స్)ను జరిపినట్టుగానే భావించానని ఆ  బుక్‌లో రాశారు ప్రిన్స్ హ్యారీ. పదేళ్ల పాటు బ్రిటీష్ ఆర్మీలో సేవలందించిన హ్యారీ..కేప్టెన్ స్థాయి వరకూ వెళ్లారు. ఇప్పటి వరకూ ఆయన ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదు. అపాచీ హెలికాప్టర్‌కు కెమెరా ఉంటుందని, ఆ కెమెరా ద్వారానే తాను ఎంత మంది తాలిబన్లను చంపానో తెలిసిందని చెప్పారు. 911 దాడుల బాధితుల కుటుంబ సభ్యులను కలిశానని, అందుకే తాలిబన్లను చంపినా కూడా తనకు ఎలాంటి రిగ్రెట్ లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వాళ్లు మానవత్వానికి శత్రువులు అని తాలిబన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.