టార్గెట్ గుజరాత్..కేంద్రం వ్యూహమిదేనా..? 


ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని ప్రకటించినప్పటి నుంచి ఎవరీ వ్యక్తి..? భాజపా ఆమెనే ఎందుకు ఎంపిక చేసుకుంది అన్న ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయి. అధిష్ఠానం ఎంతో వ్యూహాత్మకంగా ఆలోచించి ఆమెను బరిలో నిలిపిందని, విపక్షాలు ఆశలు గల్లంతవటం తప్పదని భాజపా వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. ఝార్ఖండ్ గవర్నర్‌గా పని చేసిన ద్రౌపది ముర్ము గిరిజన వర్గానికి చెందిన వారు. 


మరో ఆసక్తికర అంశం ఏంటంటే..గుజరాత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. 
గుజరాత్‌లో 15% గిరిజన జనాభా ఉన్నట్టు 2011 జనాభా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రాష్ట్రంలోనే కాదు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఝార్ఖండ్‌లోనూ గిరిజన జనాభా ఎక్కువగా ఉంటుంది. ఈ అన్ని రాష్ట్రాల్లోనూ కోటి మందికిపైగా గిరిజనులున్నారు. సాధారణజనాభాతో పోల్చి చూస్తే..అత్యధిక ఎస్‌టీ జనాభా ఉన్న రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్‌. అన్ని రాష్ట్రాల కన్నాఅత్యధికంగా ఛత్తీసగఢ్‌లో 31%,ఝార్ఖండ్‌లో 26%, ఒడిశాలో 23% గిరిజనులున్నారు. అయితే వీటన్నింటిలోనూ గుజరాత్‌పైనే ఎక్కువగా దృష్టి సారించింది కేంద్రం. ప్రధాని మోదీ సహా హోం మంత్రి అమిత్‌షా ఈ రాష్ట్రానికే చెందిన వారు కావటం వల్ల ప్రాధాన్యత పెరిగింది.


గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజన వర్గాన్ని ఆకట్టుకునేందుకూ ద్రౌపది ముర్ముని బరిలోకి దింపినట్టు చర్చ జరుగుతోంది. గుజరాత్‌లో భాజపా ట్రాక్ రికార్డ్ చూస్తే ఎందుకంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. 2004లో 14 సీట్లు గెలుచుకున్న భాజపా, 47% ఓట్లు రాబట్టుకుంది. తరవాత 2009లో 15 సీట్లు సాధించి 46.5% ఓట్లు గెలుచుకుంది. 2014లో 26 సీట్లు, 2019లో 26 సీట్లు సాధించింది. 2019 నాటికి భాజపా ఓటు శాతం 63%కి పెరిగింది. 



ఎస్‌టీ నియోజకవర్గాల్లోనూ గట్టిగా నిలబడాలని..


ఓటు శాతం బాగానే ఉన్నా, గిరిజన నియోజకవర్గాల్లో మాత్రం వెనకబడుతూ వస్తోంది భాజపా. 2007, 2012, 2017 ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యం కొనసాగింది. అందుకే ఈ ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి తమ జెండా పాతాలని చూస్తోంది భాజపా. ఈశాన్య రాష్ట్రాల్లోనూ భాజపా బలం పెంచుకునేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మిజోరం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్‌ లాంటి రాష్ట్రాల్లో గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ మద్దతు కూడగట్టవచ్చని ప్లాన్ చేసింది భాజపా.