Maldives Parliamentary Elections: మాల్దీవ్స్ ఎన్నికల్లో అధ్యక్షుడు (Maldives Presidential Elections 2024) మహమ్మద్ ముయిజూ (Mohamed Muizzu) పార్టీ మరోసారి విజయం సాధించింది. ఏప్రిల్ 21న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ముయిజూ పార్టీ People's National Congress (PNC) ఘన విజయం సాధించింది. 93 స్థానాలున్న పార్లమెంట్ ఎన్నికల్లో 90 చోట్ల పోటీ చేసింది పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్. ఇప్పటి వరకూ 86 స్థానాల ఫలితాలు వెల్లడించగా అందులో 66 చోట్లు PNC పార్టీ గెలుపొందింది. సభలో మూడింట రెండొంతుల మెజార్టీని సొంతం చేసుకుంది. భారత్‌కి దూరంగా ఉంటున్న ముయిజూ చైనాకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి ఆయన పార్టీ అక్కడ ఈ స్థాయిలో గెలుపొందడం కీలకంగా మారింది. ఇకపై భారత్‌కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేందుకు దీన్నే మంచి అవకాశంగా భావిస్తోంది ఆ పార్టీ. నిజానికి ఈ ఎన్నికల ఫలితాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ముయిజూ చైనాకి దగ్గరవడం ఇబ్బందికరంగా మారింది. పైగా మాల్దీవ్స్‌లోని భారత సైనికులు వెనక్కి వెళ్లిపోవాలంటూ ముయిజూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఆ మధ్య చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చైనాలో రెండు రోజుల పాటు పర్యటించారు. తమది చిన్న ద్వీప దేశమే అని చులకనగా చూడొద్దని భారత్‌ని ఉద్దేశిస్తూ పరోక్షంగా హెచ్చరించారు. గతేడాదే ఆయన మాల్దీవ్స్‌కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 


భారత్‌ వ్యతిరేక విధానం..


ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎన్నికలు జరగక ముందు వరకూ ముయిజూ పార్టీ మరో పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఇప్పుడు సొంతగా భారీ మెజార్టీ సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అంతకు ముందు ముయిజూ అధ్యక్షుడు అయినప్పటికీ మెజార్టీ లేకపోవడం వల్ల కొన్ని విధానాలకు ఆమోదం లభించలేదు. ఇప్పుడా సమస్య లేకుండా పోయింది. పైగా ఈ సారి అధికారంలోకి రావడానికి సంచలన హామీ ఇచ్చారు మహమ్మద్ ముయిజూ. భారత సైనికులను మాల్దీవ్స్‌ నుంచి వెనక్కి పంపేస్తానని భరోసా ఇచ్చారు. పరోక్షంగా భారత్ విషయంలో తన పాలసీ ఏంటో చెప్పకనే చెప్పారు. ఆయన పార్టీ విజయం సాధించడానికి ఇది కూడా ఓ కారణమని భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే ముయిజూ పార్టీకే మెజార్టీ ఉండాలన్న భావన ప్రజల్లో వచ్చేలా చూసుకున్నారు. చైనా పెద్ద ఎత్తున మాల్దీవ్స్‌కి సాయం అందించాలంటే ఆ దేశంతో సన్నిహితంగా ఉంటున్న ముయిజూ వల్లే సాధ్యం అవుతుందన్న అభిప్రాయమూ బలపడిపోయింది. గతేడాది ఎన్నికలు ముగిసి అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే బీజింగ్‌కి వెళ్లారు ముయిజూ. మాల్దీవ్స్‌లోని 80 మంది భారతీయ సైనికులను వెనక్కి పంపే వరకూ ఊరుకోమని తేల్చి చెప్పారు. అయితే..ఆర్థిక సాయం విషయానికి వచ్చినప్పుడు మాత్రం భారత్‌పై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. మాల్దీవ్స్‌తో భారత్‌కి మైత్రి అవసరమే అని అంటున్నారు ముయిజూ. ఇలా తమ అవసరానికి తగ్గట్టుగా మాట్లాడేస్తున్నారు. అయితే...ఈ వైఖరిని భారత్‌ గమనిస్తోంది. 


Also Read: అమ్మ చనిపోయినా కడుపులో బిడ్డ మాత్రం సేఫ్‌, డెలివరీ చేసిన వైద్యులు - గాజాలో అద్భుతం