మాల్దీవుల నుంచి అక్కడికి పరారీ..
దేశంలో తనపై ఉన్న వ్యతిరేకతను తట్టుకోలేక మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స, అక్కడి నుంచి తన సెక్యూరిటీ ఆఫీసర్స్‌తో కలిసి సింగపూర్‌కి పరారయ్యారు. గొటబయ రాజపక్స, ఆయన భార్య లోమా రాజపక్స, ఇద్దరు భద్రతా అధికారులు మాలీ నుంచి సింగపూర్‌కి ఫ్లైట్‌లో వెళ్లారు. ఇప్పటికే సింగపూర్‌కి వెళ్లాల్సి ఉండగా, భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాణం రద్దైందని తెలుస్తోంది. మాల్దీవ్స్ ప్రభుత్వం వీరి కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేసిందని అక్కడి మీడియా వెల్లడించింది. శ్రీలంకలో అక్కడి రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతితో మాల్దీవులకు వచ్చారు గొటబయ రాజపక్స. ఆయన కోసం ఎయిర్‌ఫోర్స్ ఫ్లైట్‌నీ ఏర్పాటు చేశారు.
జులై 20వ తేదీన అధ్యక్షుని నియామకం
ప్రస్తుతం శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ ప్రావిన్స్‌లో కర్ఫ్యూ విధించారు. జులై 20 వ తేదీన దేశాధ్యక్షుడిని నియమించనున్నారు. ఇందుకోసం జులై 19న నామినేషన్లు వేయనున్నారు. నిజానికి
ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా ఇప్పటికే రాజీనామా చేయాల్సింది. ఆందోళనకారులు ఎప్పటి నుంచో ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. ఆయన ఇంటికి నిప్పు పెట్టారు కూడా. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాను రాజీనామా చేయటం సరికాదని, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాకపదవి నుంచి తప్పుకుంటానని వెల్లడించారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకునే రాజీనామా చేయలేదని వివరిస్తున్నారు. నిరసనకారులు ప్రధాని భవనం, అధ్యక్ష భవనంలోకి వెళ్లి నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని రణిల్ విక్రమ సింఘే వ్యాఖ్యానించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా తనను తప్పుకునేలా చేయాలని విధ్వంసకారులు చూస్తున్నారని ఆయనఆరోపించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు శ్రీలంక పోలీసులు, సైన్యానికి పూర్తి స్థాయి అధికారాలు ఇస్తున్నట్లు శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు విక్రమ సింఘే స్పష్టం చేశారు.