Prajwal Revanna Case Update: కర్ణాటక రాజకీయాల్ని కుదిపేసిన ప్రజ్వల్ రేవణ్ణ కేసు (Prajwal Revanna Case) మరో కీలక మలుపు తిరగనుంది. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పటి నుంచి కనిపించకుండా పోయినా ప్రజ్వల్ త్వరలోనే భారత్‌కి రానున్నట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించింది. తనపై కేసులు నమోదైన వెంటనే జర్మనీకి పారిపోయాడు. ఇన్నాళ్లుగా అక్కడే తలదాచుకున్నాడు. ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఏ దేశంలో ఉన్నా అక్కడి పోలీసులు జాడ తీసి అరెస్ట్ చేసేందుకు అంతా సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆయన మే 30వ తేదీన జర్మనీ నుంచి బయలుదేరి మే 31వ తేదీన తెల్లవారుజామున బెంగళూరుకి రానున్నట్టు PTI వెల్లడించింది. ప్రస్తుతానికి ఈ కేసుని SIT విచారిస్తోంది. బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌పై నిఘా పెట్టింది. వచ్చీ రాగానే అక్కడే అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది. కర్ణాటకలోని హసన్‌ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణపై ఏప్రిల్‌ నెలలో లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. ఓ మహిళని లైంగికంగా వేధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా అది అక్కడి రాజకీయాల్ని వేడెక్కించింది. చాలా మంది మహిళల్ని ఇలాగే వేధించారంటూ ఆరోపణలు వచ్చాయి. మూడు కేసులూ నమోదయ్యాయి.