TDP Meeting in Nellore: 2024లో జగన్ ఇంటికి పోవటం తథ్యం అని చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయం అని మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణ వ్యాఖ్యానించారు. ఈ నెల 28న నెల్లూరులో చంద్రబాబు రా కదలి రా సభను విజయవంతం చేద్దామని టీడీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. నెల్లూరులోని ఎస్‌వీజీఎస్ మైదానంలో సభ ఏర్పాట్లను ఆయన టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు. రా కదలి రా...కార్యక్రమం సందర్భంగా 28వతేదీ ఉదయం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరుకు విచ్చేస్తున్నారని తెలిపారు. 28 నియోజకవర్గాల్లో రా కదలి రా కార్యక్రమాన్ని చాలా విస్తృతంగా నిర్వహిస్తున్నారన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందని.. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ఏం జరిగిందన్న విషయాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా...2019 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ప్రజల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందోనన్న విషయాలను చంద్రబాబునాయుడు ఎంతో చక్కగా వివరిస్తున్నారని చెప్పారు. రా కదలి రా కార్యక్రమానికి అశేష జనం తరలి వస్తుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరుగుతుందా...? ఎప్పుడెప్పుడు జగన్మోహన్‌రెడ్డి ఇంటికి పంపించేద్దామా అని... టీడీపీని అధికారంలోకి తెచ్చుకుందామా అని... ప్రజలందరూ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వానికి వచ్చిన వ్యతిరేకత భారతదేశంలోని ఏ ప్రభుత్వానికి రాలేదని ఎద్దేవా చేశారు. ఎప్పుడైతే అమరావతి రాజధానిలో ప్రజావేదికను కూల్చాడో అప్పుడే జగన్ ప్రభుత్వానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందన్నారు. జగన్ ఒక సైకో ఒక శాడిస్ట్ అని ప్రజలకి అప్పుడే అర్ధమైపోయిందన్నారు. ప్రజా వేదిక అనేది ప్రజల సొమ్ము అని దానిని కూల్చివేయడం దారుణమన్నారు. ఈ రాష్ట్రంలో డెవలప్ మెంట్ అనేది పూర్తిగా నిల్ అన్నారు. ఇదే విధంగా జరిగితే రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగాలు ఉండవని.. వారి భవిష్యత్ అంధకారమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ దెబ్బకి వ్యాపారస్తులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడడం దుర్మార్గమన్నారు. జగనే నేను వెళ్లిపోతానని అంటుండడం.. ఏ సీఎం కానీ రాజకీయ నాయకుడు కానీ.. చెప్పకూడదని, అలాంటి సీఎం ఆ మాట అనడంతో ఆయన స్టేటజీ ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొందని సెటైర్లు వేశారు. 2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని.. జగన్ ఇంటికెళ్లడం తధ్యమని అన్నారు. నెల్లూరులో జరిగే చంద్రబాబు రా కదలి రా కార్యక్రమానికి ఏడు నియోజకవర్గాల్లోని తెలుగు తమ్ముళ్లు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, ప్రజలు విశేషంగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నారాయణ కోరారు.