Sever Road Accident in Chilakaluripeta: పల్నాడు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో స్థానిక బస్టాప్ వద్ద కూలీలతో వెళ్తోన్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని వేలూరు గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కూలీలు నాదెండ్ల మండలం అప్పాపురంలో మిర్చి కోతలకు ఆటోలో వస్తున్నారు. అదే సమయంలో మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చిలకలూరిపేట వైపు వెళ్తోంది. ఈ క్రమంలో లింగంగుంట్ల బస్టాప్ వద్ద గణపవరం రోడ్డు నుంచి ఆటో ఒక్కసారిగా చిలకలూరిపేట రోడ్డులోకి వచ్చింది. అప్రమత్తమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు. బస్సు కింద పడి ఆటో నుజ్జయింది.


మృతుల వివరాలు


ఆటోలోని కూలీల్లో యాకసిరి హనుమాయమ్మ (60) స్పాట్ లోనే మృతి చెందారు. ఆటో డ్రైవర్ సహా 14 మంది కూలీలను స్థానికులు, పోలీసులు చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్సులో తరలించారు. అక్కడ చికిత్స అందించే లోపే గన్నవరపు శివపార్వతి (58) మృతి చెందారు. తీవ్ర గాయాలైన షేక్ హజరత్ వలీ (65) గుంటూరు తరలించి జీజీహెచ్ లో చికిత్స అందించే లోపే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో గోరంట్ల శివకుమారి (60), సురుగుల కోటేశ్వరమ్మ (60)లను మెరుగైన వైద్యం కోసం వివిధ ఆస్పత్రులకు తరలించారు. 


గాయపడిన వారి వివరాలు


ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో షేక్ సుబాని (ఆటో డ్రైవర్), పాలెపు రజని (42), సట్టు పార్వతి (39), షేక్ వహీదా (32), బేతంచెర్ల మల్లేశ్వరి (45), పాలెపు శారద (23), ఎస్ కే జాన్ బీ (40), ఎస్.కె.ఖాదర్ బీ (37), ఎస్.కె మహబూబీ (52), ఎస్.కె మస్తాన్ బీ (35), ఎస్ కే బాజీ (14) ఉన్నారు. కాగా, ప్రమాద స్థలాన్ని చిలకలూరిపేట గ్రామీణ ఎస్సైలు రవి కృష్ణ, బాలకృష్ణ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


తెలంగాణలోనూ తీవ్ర విషాదం


అటు, తెలంగాణలోనూ శుక్రవారం తీవ్ర విషాదం జరిగింది. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో కరెంట్ షాక్ తో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో జాతీయ జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తుండగా.. ముగ్గురు యువకులు విద్యుదాఘాతానికి గురయ్యారు. గద్దెపై ఐరన్ పోల్ పెడుతుండగా.. అది కాస్త పైనున్న విద్యుత్ వైర్లను తాకింది. దీంతో ల్యాడ విజయ్, అంజిత్, చక్రిలు కరెంట్ షాక్ తో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వీరిని గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ విజయ్, అంజిత్ లు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరికీ సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. మరో యువకుడు చక్రి.. స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క (Minister Seethakka) ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సాయంగా ఇరు కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. విద్యుత్ శాఖ తరఫున బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. గాయపడి చికిత్స పొందుతున్న మరో యువకునికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గ్రామాల్లో, పొలాల్లో ఎక్కడైనా ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు వేలాడుతుంటే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గణతంత్ర వేడుకల వేళ ఇలా జరగడం బాధాకరమని, బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని అన్నారు.



Also Read: YSRCP Leaders personal image: పాలిటిక్స్‌లో ప‌ర్స‌న‌ల్‌ ఇమేజ్.. వైసీపీ నేత‌ల్లో అంత‌ర్మ‌థ‌నం.. వీరికి దెబ్బేనా?