Police stopped TDP MLA Nimmala Ramanaidu:


చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుకోవడం తెలిసిందే. అయితే తాము మాత్రం రోడ్డు మీద కనీసం నడవకూడదా, నడిచే హక్కు లేదా అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను శాంతియుతంగా నిరసన జరుపుతుంటే, ఒక్క వ్యక్తినే ఉన్నా తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధిగా రోడ్డు మీదకు వచ్చిన వ్యక్తిని ఎలా టచ్ చేస్తారు, ఎమ్మెల్యేను సైతం పోలీసులు ఈ తీరుగా అడ్డుకోవడం సరికాదన్నారు. 


తాను ఒక్కడినే రోడ్డు మీద వెళ్తుంటే 144 సెక్షన్ ఎలా వర్తిస్తుందని పోలీసులను నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. వైసిపి నేతలు నిన్న నరసరావుపేటలో బాణాసంచా కాల్చి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారని, తాను టీడీపీ ఎమ్మెల్యే అయినందున ఒక్కడినే రోడ్డు మీద వెళ్తుంటే అడ్డుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తనతో తీసుకున్న పేపర్ ఇవ్వాలని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నానని, ప్రభుత్వానికి నిరసన తెలపడం తమ హక్కు అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యే పరిస్థితి ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని పోలీసులను నిలదీశారు.


రాజ్యాంగంలో బ్రతికే ఇద్దరికీ రాజ్యాంగం ఒకే విధంగా వర్తించదా? వైసీపీకి, టీడీపీకి వేర్వేరుగా ఉంటుందా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనను ఇదే తీరుగా అడ్డుకుంటుంటూ హైకోర్టుల్ రిట్ వేస్తానన్నారు. అవినీతి పరులు రాష్ట్రంలో బయట తిరుగుతుంటే, నిజాయితీపరులను అరెస్టు చేసి జైళ్లో పెడుతోంది వైసీపీ సర్కార్ అని అసహనం వ్యక్తం చేశారు. గత 5 రోజులుగా టీడీపీ ఎమ్మెల్యే అయిన తనను పోలీసులు సింగిల్ గా రోడ్డు మీదకు రాకుండా అడ్డుకుంటున్నారని, స్వేచ్ఛను హరిస్తున్నారని, ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని కోర్టును ఆశ్రయిస్తానని పోలీసులను హెచ్చరించారు.






అక్రమ అరెస్టుకు నిరసనగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది టీడీపీ. ఈ నిరసన దీక్షలతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడుకు అండగా తోడుగా ఉండాలని చైతన్య కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నామని చెప్పారు. చంద్రబాబు అక్రమ కేసుల నుండి బయటకి వచ్చేంతవరకు పార్టీ శ్రేణులంతా అండగా, తోడుగా ఉంటాయన్నారు. తాలిబన్లను మించి, హిట్లర్ని మించి, ముషారఫ్ ని మించిన నిరంకుశ పాలన ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్నాడని విమర్శించారు. 


చంద్రబాబుపై ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌ను కొట్టివేయాలని దాఖలైన క్వాష్ పిటిషన్ పై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. దీనిపై పూర్తి వాదనలు వినాల్సి ఉందని ఏపీ హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. కాబట్టి, అప్పటి వరకూ చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది. క్వాష్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు సీఐడీ సమయం కోరగా.. హైకోర్టు అందుకు అంగీకరించింది.