పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ దానంతట అదే త్వరలో భారత్‌లో కలుస్తుంది, కాస్త వేచి ఉండండి అంటూ కేంద్ర మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని దౌసాలో ప్రెస్‌ కాన్ఫరెన్సన్‌లో పాల్గొన్న మంత్రిని విలేకరులు ఈ అంశంపై ప్రశ్నించగా ఆయన వై విధంగా సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. బీజేపీ చేపడుతున్న పరివర్తన్‌ సంకల్ప్‌ యాత్రలో భాగంగా వీకే సింగ్‌ దౌసాలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అయితే పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలోని వారు భారత్‌లో కలిసిపోయేందుకు డిమాండ్‌ చేస్తున్నారు దీనిపై స్పందించమని అడగగా ' పీఓకే త్వరలోనే భారత్‌లో దానంతట అదే కలిసిపోతుంది. కాస్త సమయం వేచి ఉండండి' రిటైర్డ్‌ ఆర్మీ చీఫ్ జనరల్‌ వీకే సింగ్‌ బదులిచ్చారు.


ఇటీవల చైనా భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను, ఆక్సాయ్‌చిన్‌ను తమ భూభాగంగా చూపిస్తూ మ్యాప్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే వీకే సింగ్‌ ఈ విధంగా మాట్లాడడం ఆసక్తి కలిగిస్తోంది. 2023 చైనా స్టాండర్డ్‌ మ్యాప్‌ పేరుతో చైనా విడుదల చేసిన మ్యాప్‌పై భారత్‌ తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేసింది. భారత్‌తోపాటు పొరుగున ఉన్న ఇతర దేశాలు కూడా చైనా చర్యలను తీవ్రంగా ఖండించాయి.  అలాగే పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉంటున్న ప్రజలు తాము భారత్‌తో కలిసిపోతామని డిమాండ్లు చేస్తున్నారు. ఇటీవల పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహించారు. అక్కడి షియా ముస్లింల నుంచి డిమాండ్లు ఎక్కువగా వస్తున్నాయి. భారత్‌తో ఉన్న సరిహద్దును తెరవాలని తాము భారత్‌తో కలుస్తామని వారు గట్టిగా చెప్తున్నారు.


భారత అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సు విజయవంతం కావడంపైన మంత్రి వీకే సింగ్  ప్రశంసలు కురిపించారు. ఈ సమ్మిట్‌ విజయం వల్ల ప్రపంచ వేదికపై భారత్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ప్రపంచ దేశాల్లో భారత్‌ సత్తాను చాటుకుందని ఆయన వెల్లడించారు. జీ20 గ్రూప్‌లో ప్రపంచంలోని అన్ని శక్తివంతమైన దేశాలు ఉన్నాయని, భారత్‌ ఈ సమావేశాలను నిర్వహించడం ఇదే తొలిసారి అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ సమావేశాలను అద్భుతంగా నిర్వహించారని కొనియాడారు. ఈ సదస్సుతో భారత తన సత్తా చాటుకుందని అన్నారు. 


అలాగే రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మంత్రి విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందని దుయ్యబట్టారు. దీని వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇందుకే బీజేపీ పరివర్తన్‌ సంకల్ప్‌ యాత్రను నిర్వహిస్తోందని అన్నారు. ప్రజలు పరివర్తన కోరుకుంటున్నారని , ఈ యాత్రకు తరలి రావాలని నిర్ణయించుకుంటున్నారని వీకే సింగ్‌ వెల్లడించారు. ఈ యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా అపారమైన మద్దతు లభిస్తోందని అన్నారు. 


రాబోయే ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని విలేకరులు ప్రశ్నించగా.. ఎన్నికలు వస్తే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే పోటీ చేస్తుందని, కేవలం ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతోనే తాము పోటీలో దిగుతామని వీకే సింగ్‌ స్పష్టంచేశారు. పార్టీ ప్రజలకు ఉపయోగపడే నాయకులకు, ప్రజల నమ్మకం సాధించిన నాయకులకు, మంచి వారికి తప్పకుండా అవకాశం ఇస్తుందని ఆయన తెలిపారు.