Pocso Case Against BS Yediyurappa: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది. ఓ మైనర్‌ని లైంగికంగా వేధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. బెంగళూరులోని సదాశివనగర్‌ పోలీస్ స్టేషన్‌లో  17 ఏళ్ల బాలిక ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఫిబ్రవరి 2వ తేదీన యడియూరప్ప తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో ప్రస్తావించింది బాధితురాలు. ఓ ఛీటింగ్‌ కేసులో సాయం కోసమని తల్లితో పాటు ఆయన ఇంటికి వెళ్తే లైంగికంగా వేధించినట్టు ఆరోపించింది. తన గదిలోకి పిలిచి ఇలా అసభ్యంగా ప్రవర్తించినట్టు చెప్పింది. అయితే...ఈ ఆరోపణలపై ఇప్పటికే దుమారం రేగింది. యడియూరప్పని ఇదే విషయమై మీడియా ప్రశ్నించగా...సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందు ఇలాంటి ఫిర్యాదు చేయడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. దీనిపై కచ్చితంగా దృష్టి పెట్టాలని అన్నారు. ప్రాథమిక వివరాల ప్రకారం..బాధితురాలు ఏదో మానసిక వ్యాధితో బాధ పడుతోంది. సాయం కోసం యడియూరప్ప దగ్గరికి వెళ్లిన సమయంలో ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆ సమయంలోనే యడియూరప్ప ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల్ని యడియూరప్ప వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. గతంలో తల్లికూతుళ్లు కలిసి కావాలనే 50 సార్లు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. మొత్తానికి ఇది రాజకీయంగా ఒక్కసారిగా వేడి పుట్టించింది. 


"కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తన కూతుర్ని లైంగికంగా వేధించాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ కొనసాగిస్తున్నారు. నిజానిజాలేంటో తెలిసేంత వరకూ దీని గురించి ఎక్కువగా మాట్లాడలేం. ఇది చాలా సున్నితమైన విషయం. పోలీసుల విచారణలో ఏం తేలుతుందో వేచి చూద్దాం"


- జి పరమేశ్వర, కర్ణాటక హోం మంత్రి