PM Modi Security Breach Hubli:


హుబ్లీలో ర్యాలీ..


ప్రధాని మోడీ ప్రస్తుతం కర్ణాటక పర్యటనలో ఉన్నారు. హుబ్లీలో భారీగా ర్యాలీ నిర్వహించారు. కార్‌లో నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగిపోయారు. ఈ సమయంలోనే అనుకోని ఘటన ఒకటి జరిగింది. అంత సెక్యూరిటీని దాటుకుని ఓ యువకుడు మోడీ కాన్వాయ్ వద్దకు వచ్చాడు. వెంటనే ఎస్‌పీజీ సిబ్బంది గుర్తించి అతడిని పక్కకు తప్పించారు. ప్రధానికి పూల మాల ఇచ్చేందుకు ఆ యువకుడు వచ్చాడు. అయితే...అంత కట్టుదిట్టమైన భద్రతనూ దాటుకుని ఎలా రాగలిగాడన్నది ఆందోళనకరంగా మారింది. 
కర్ణాటకలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేసుకుంటోంది బీజేపీ. మిషన్ కర్ణాటకపై పూర్తి స్థాయి దృష్టి సారించింది. మరోసారి కచ్చితంగా తమ పార్టీ అధికారంలోకి రావాలని బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకే...స్వయంగా ప్రధాని మోడీయే రంగంలోకి దిగారు. 






గతంలో..


గతేడాది అక్టోబర్‌లోనూ గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటించారు.  భరూచ్ జిల్లాలో దేశంలోనే మొట్టమొదటి 'బల్క్ డ్రగ్ పార్క్'కి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జామ్‌నగర్‌లో ప్రధాని మోదీ రోడ్‌ షో నిర్వహించారు. ఈ రోడ్‌షో సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఒక్కసారిగా కారు దిగి.. రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తి దగ్గరకు వచ్చారు. ఇది చూసి అక్కడున్న ప్రజలతో పాటు, భద్రతా సిబ్బంది కూడా షాకయ్యారు. ప్రధాని మోదీని చూసేందుకు ఓ వ్యక్తి  ఒక చిత్రపటం పట్టుకుని అక్కడ నిల్చొని ఉన్నాడు. ఇది గమనించిన మోదీ కారు దిగి నేరుగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లారు. వెంటనే ఆ వ్యక్తి ఓ చిత్రాన్ని మోదీకి బహూకరించారు. ఆ చిత్రంలో ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్‌ ఉన్నారు. దీంతో ఫోటోపై ప్రధాని ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు.


ఆపరేషన్ లోటస్..


కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కర్ణాటకలోనూ గుజరాత్ ఫలితాలు రిపీట్ అవుతాయని చాలా ధీమాగా చెబుతున్నారు. కానీ...హిమాచల్‌లో జైరామ్ ఠాకూర్‌ను ప్రజలు ఎలాగైతే పక్కన పెట్టారో..అలాగే బొమ్మై సర్కార్‌ను కూడా పక్కన పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఓ సారి కర్ణాటక ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ని గమనిస్తే...2004 నుంచి అక్కడి ఓటర్లు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. 2008లో బీఎస్ యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ 110 స్థానాలు గెలుచుకుంది. ఆ తరవాత..."ఆపరేషన్ లోటస్" మొదలు పెట్టి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తనవైపు లాక్కుంది. మ్యాజిక్ ఫిగర్‌ సాధించుకుంది. ఆ తరవాత 2013లో మాత్రం బీజేపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ ఎన్నికల్లో 40 సీట్లకే పరిమితమైంది కాషాయ పార్టీ. ఓటు షేర్ కూడా దారుణంగా పడిపోయింది. కాంగ్రెస్ 122స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018లో మళ్లీ సీన్ మారింది. కాంగ్రెస్‌ను కాదనుకుని ఓటర్లు బీజేపీకి ఓటు వేశారు. కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితం కాగా...బీజేపీ 104 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్ జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిప్పటికీ...ఆపరేషన్ లోటస్ ధాటికి ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. కాంగ్రెస్, జేడీఎస్‌ కూటమికి చెందిన 17  మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి బీజేపీలో చేరారు. ఫలితంగా...బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ ట్రెండ్‌ కొనసాగితే...ఈ సారి ఓటర్లు కాంగ్రెస్‌కు అవకాశమిస్తారేమో అన్న అంచనాలున్నాయి.


Also Read: Nupur Sharma: నుపుర్ శర్మకు హత్యా బెదిరింపులు, గన్ లైసెన్స్ ఇచ్చిన పోలీసులు