దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత విస్తృతం చేయడమే లక్ష్యంగా కేంద్రం ఇ-రూపీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. నగదురహిత లావాదేవీల ప్రోత్సాహం, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు.
ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో ఇ-రూపీ కీలక పాత్ర పోషించనుందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. లబ్ధిదారులకు పారదర్శకంగా నగదు చేరేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని తెలిపారు. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు.
ఏంటి ఉపయోగం?
ఇ-రూపీ వ్యవస్థలో ఒక క్యూర్ కోడ్ లేదా ఎస్‌ఎంఎస్ స్ట్రింగ్ వోచర్‌లను లబ్ధిదారుడి మొబైల్ ఫోన్‌కు పంపిస్తారు. వీటినే ఇ-రూపీగా భావించొచ్చు. అందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్ చేసి పెడతారు. ఇవి ప్రీపెయిడ్ గిఫ్ట్ వోచర్ల లాంటివే. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చు. దీనికి బ్యాంకు, యాప్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వంటి మధ్యవర్తిత్వ వేదికలేవీ అవసరం లేదు. వీటిని రీడీమ్ చేసుకోవడానికి వోచర్ కార్డు లేదా హార్డ్ కాపీ అవసరం లేదు. సందేశంలో వచ్చిన క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది. స్మార్ట్‌ఫోన్ లేని వారు వోచర్ కోడ్ చెప్పినా సరిపోతుంది.
ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఇవి ప్రయోజనకరంగా మారనున్నాయి. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేనందున ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదు. అలాగే ఆరోగ్యం, ఔషధాలకు సంబంధించిన సేవలను అందజేసేందుకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉండనున్నాయి. మాతా-శిశు సంబంధిత, టీబీ నిర్మూలన, ఆయుష్మాన్ భారత్, పీఎం ఆరోగ్య యోజన, ఎరువుల రాయితీ.. వంటి పథకాల అమలులో భాగంగా ప్రభుత్వం ఇకపై లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేసే బదులు నేరుగా వారి మొబైల్ నంబర్‌కే ఈ కూపన్‌ను పంపిస్తారు. ఉద్యోగుల సంక్షేమం సహా ఇతర ప్రయోజనాలను అందించేందుకు ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు సైతం ఇ-రూపీని వినియోగించవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
వోచర్ మాత్రమే..
గూగుల్ పే, యూపీఐ, ఫోన్ పే, పేటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి చెల్లింపు విధానాల లాగానే ఇ-రూపీ ఒక పేమెంట్ ప్లాట్‌ఫాం కాదు. ఇది నిర్దిష్ట సేవలకు ఉద్దేశించిన ఒక వోచర్ మాత్రమే. బ్యాంకు ఖాతా, డిజిటల్ పేమెంట్ యాప్, స్మార్ట్ ఫోన్ లేకున్నా ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు. వోచర్లను కొనుగోలు చేసి ఇతరులకు జారీ చేస్తున్న వ్యక్తి వోచర్ల వినియోగాన్ని ట్రాక్ చేయవచ్చు. ప్రస్తుతం 11 బ్యాంకులు ఇ-రూపీ సేవలను అందిస్తున్నాయి.