Bengal Development Projects: ప్రధాని నరేంద్ర మోదీ తన మాతృమూర్తి మరణించడంతో హుటాహుటిన గుజరాత్ చేరుకుని ఆమె అంత్యక్రియుల్లో పాల్గొన్నారు. దీంతో శుక్రవారం ఆయన పాల్గొనాల్సిన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ బంగాల్‌లో జరగాల్సి అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
హౌరా- న్యూ జల్‌పైగురిని కలుపుతూ ఈశాన్య రాష్ట్రాలకు గేట్‌వే అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అలాగే అనేక అభివృద్ధి ప్రాజెక్టులను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రైలును జెండా ఊపి, రాష్ట్రంలో రూ. 7,800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సిన ప్రధాని మోదీ.. ఈ ఉదయం తన తల్లి హీరాబెన్ అంత్యక్రియలకు హాజరు కావడానికి అహ్మదాబాద్‌కు వెళ్లాల్సి వచ్చింది.
ప్రాజెక్టులు
ప్రధాని ప్రారంభించబోయే ప్రాజెక్టులలో రూ. 2,550 కోట్ల విలువైన బహుళ మురుగునీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. కోల్‌కతా మెట్రో పర్పుల్ లైన్.. జోకా-తరటాలా స్ట్రెచ్, న్యూ జల్‌పైగురి రైల్వే స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులతో సహా అనేక ఇతర రైల్వే ప్రాజెక్టులు కూడా శుక్రవారం ప్రారంభించనున్నారు.
భాజపా సిద్ధాంతకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరు మీద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించనున్నారు. కోల్‌కతాలో జరిగే నేషనల్ గంగా కౌన్సిల్ (NGC) రెండవ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించనున్నారు.
మాతృవియోగం
మోదీ తల్లి హీరాబెన్ (100) శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్.మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి ఆమెను తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగాయి.
మాతృమూర్తి మరణంతో ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే దిల్లీ నుంచి గుజరాత్ చేరుకుని ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తొలుత గుజరాత్ గాంధీనగర్‌లోని ఆమె నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. మాతృమూర్తి పాడెను మోదీ మోశారు. అంతిమయాత్ర వాహనంలోనూ తల్లి పార్థివదేహం వద్ద కూర్చొని మోదీ భావోద్వేగానికి గురయ్యారు.
గాంధీనగర్‌లోని శ్మశానవాటికలో హీరాబెన్ అంత్యక్రియలు జరిగాయి. మోదీ తన సోదరులతో కలిసి ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
Also Read: Heeraben Modi Death: హీరాబెన్ మృతి పట్ల రాహుల్, నితీశ్ సహా ప్రముఖుల సంతాపం