PM Modi Global Leader:
మోదీయే నంబర్ వన్..
ప్రపంచంలోనే పాపులర్ లీడర్స్ లిస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకి చెందిన ఓ ఇంటిలిజెన్స్ కంపెనీ నిర్వహించిన సర్వేలో నరేంద్ర మోదీకి అత్యధిక మార్కులు పడ్డాయి. Morning Consult సర్వేలో మోదీకి 76% ఓట్లు వచ్చాయి. ఈ సర్వేపై బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. కీలక నేతలంతా సోషల్ మీడియాలో వరుస పెట్టి పోస్ట్‌లు చేస్తున్నారు. "మోదీ మేజిక్" అని ఆకాశానికెత్తేస్తున్నారు. దేశంలోనే కాకుండా..అంతర్జాతీయంగానూ ఆయన ఫాలోయింగ్ పెరుగుతోందని చెబుతున్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మోదీ చరిష్మా మరింత పెరిగిందని స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం, కొవిడ్ లాంటి సంక్షోభాలనూ సులువుగా అధిగమించగలిగామంటే ఇదంతా ప్రధాని విజన్ వల్లేనని పొగుడుతున్నారు.
"ఇటీవలి ఎన్నికల ఫలితాల తరవాత మోదీ మేనియా ఏంటో అంతర్జాతీయంగా అందరికీ తెలిసింది. కొవిడ్ లాంటి సంక్షోభ సమయాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న చరిష్మా ఏ మాత్రం తగ్గలేదు. ఎన్ని సవాళ్లు ఎదురైనా అభివృద్ధి విషయంలో ఎక్కడా భారత్ వెనకబడలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ సర్వేనే చెబుతోంది"
- షెహజాద్ పూనావాలా, బీజేపీ ప్రతినిధి
ప్రధాని నరేంద్ర మోదీ తరవాత 66% తో మెక్సికన్ లీడర్ యాండ్రెస్ మాన్యూల్ లోపెజ్ ఆబ్రడార్ (Andres Manuel Lopez Obrador) రెండో స్థానంలో నిలిచారు. ఆ తరవాత స్విట్జర్‌లాండ్ నేత అలైన్ బెర్సెట్ (Alain Berset) 58%తో మూడో స్థానంలో ఉన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని 41% మార్కులతో ఆరో స్థానం దక్కించుకున్నారు.
ఈ సర్వేపై కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ అనుభవం, నాయకత్వం లక్షలాది మంది ప్రజల హృదయాల్లో చోటు సంపాదించి పెట్టిందని కొనియాడారు. ఆయన కర్మయోగి అని మరి కొందరు బీజేపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ ప్రధాని మోదీ వైపే చూస్తున్నాయని, వాళ్ల సమస్యలకి పరిష్కారం అడుగుతున్నాయని చెబుతున్నారు.